వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద
కాశిబుగ్గ: వరంగల్ దేశాయిపేట నెహ్రూ మెమోరియల్ స్కూల్‌లో పారిశుద్ధ్య నిర్వహణ, పరిసరాల అపరిశుభ్రతపై కలెక్టర్ డాక్టర్ సత్యశారద అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తాత్కాలిక వసతి కోసం నెహ్రూ మెమోరియల్ స్కూల్‌లో ఇటీవల మరమ్మతు పనులు చేసి, విద్యార్థులను ఈ స్కూల్ భవనంలోకి పంపించారు. శుక్రవారం కలెక్టర్ సత్యశారద పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణలో మరుగుదొడ్లు, కాంపౌండ్ గేట్ నిర్మాణ పనులు ఆశించిన స్థాయిలో లేకపోవడం, ఆవరణలో పరిశుభ్రత లోపించడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఈ నిర్మాణం పనులు వేగవంతంగా పూర్తి చేయడంతోపాటు పాఠశాల ప్రాంగణాన్ని ఎల్లప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే, విద్యార్థులకు అందిస్తున్న మఽ ద్యాహ్న భోజనం, మౌలిక సదుపాయాలు, భవన నిర్మాణ పనులు పరిశీలించారు. మధ్యా హ్న భోజనం మెనూ ప్రకారం ఎలా ఇస్తున్నారో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. రాజీపడకుండా విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని నిర్వాహకులకు సూచించారు. తరగతి గదుల్లోకి వవెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం ఆమె పాత పాఠశాల భవన పునరుద్ధరణ పనులు కూడా పరిశీలించారు. పనుల గురించి డీఈఓను అడిగి తెలుసుకున్నారు. రెనోవేషన్ పనులను త్వరితగతిన పూర్తి చేసి, విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్లు, ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆమె వెంట డీఈఓ రంగయ్యనాయుడు, ఏఎంఓ ఉండ్రాతి సుజన్ తేజ, తహసీల్దార్ శ్రీకాంత్, ఎంఈఓ వెంకటేశ్వర్‌రావు, ఇంజనీరింగ్ అధికారి అజీజ్, హెచ్‌ఎం ఉషారాణి పాల్గొన్నారు.


