పొడిదుక్కిలో విత్తనాలు వేయొద్దు.. | - | Sakshi
Sakshi News home page

పొడిదుక్కిలో విత్తనాలు వేయొద్దు..

Jun 12 2026 7:19 AM | Updated on Jun 12 2026 7:19 AM

పొడిదుక్కిలో విత్తనాలు వేయొద్దు..

హన్మకొండ: సమృద్ధిగా వర్షం కురిసిన తర్వాతే విత్తనాలు విత్తాలని, పొడి దుక్కిలో విత్తితే రైతులు నష్టపోతారని హనుమకొండ జిల్లా వ్యవసాయాధికారి విజయ్‌ చంద్ర, సహాయ సంచాలకుడు ఆదిరెడ్డి, డాట్‌ సెంటర్‌ వ్యవసాయ శాస్త్రవేత్త నర్సయ్య అన్నారు. బుధవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘హలో వ్యవసాయాధికారి’ కార్యక్రమంలో జిల్లాలోని రైతులు.. సాగు, విత్తనాలు, ఎరువుల సమస్యలు ఫోన్‌ ద్వారా తెలిపారు. వారికి అధికారులు తగిన సలహాలు, సూచనలు ఇచ్చారు. సాగు ఆలస్యమవుతున్నందున వరిలో మధ్యకాలిక, స్వల్పకాలిక రకాలు సాగు చేయడం మంచిదని, పచ్చిరొట్ట ఎరువు సాగులో పెసర విత్తి పంట తీసుకోవచ్చని ఇది రైతుకు లాభదాయకమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రైతులు అడిగిన ప్రశ్నలు, అధికారుల సమాధానాల్లో కొన్ని ముఖ్యమైనవి ఇలా..

ప్రశ్న : పత్తి గింజలు ఎండలో పెడితే కరిగిపోయాయి. ఇప్పుడు ఏ పత్తి గింజలు నాటాలి?

– మాదాసి వెంకటేశ్‌, వెంకటాపూర్‌, ఐనవోలు

జవాబు: గింజలు వేడికి కరిగిపోతాయి. మార్కెట్‌లో ఉన్న అ న్ని రకాలు మంచివే. షాపు వారు చెప్పినవే కాకుండా మీకు అనుభవం ఉన్న మేరకు విత్తనాలు ఎంపిక చేసుకోవాలి.

ప్రశ్న : నాకు మూడెకరాల భూమి ఉంది. ఏ వంగడాలు ఎంచుకోవాలి. – మేక చిరంజీవి, వెంకటాపూర్‌,

జవాబు: మార్కెట్‌లో లభించే మంచి రకాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. ప్రధానంగా 8 రకాలకు మాత్రం రేటు పడిపోదు. నూక తక్కువగా వస్తుంది. వరిలో ఆర్‌ఎన్‌ఆర్‌ 15048, కూనారం 1638, జగిత్యాల 2443, వరంగల్‌ 961, వరంగల్‌ 915, బీపీటీ, జై శ్రీరాం. హెచ్‌ఎంటీ, డబ్ల్యూజీఎల్‌ 962, డబ్ల్యూజీఎల్‌ 44, వరంగల్‌ సిద్ది వంటి రకాలున్నాయి. ఈ రకాలు మంచి దిగుబడిని ఇస్తాయి. దీర్ఘకాలిక రకాలు 150 నుంచి 160 రోజులు, మధ్యకాలిక రకాలు 130–140, స్వల్పకాలిక రకాలు 125 రోజుల్లో వస్తాయి. వరంగల్‌ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేట్‌లో విత్తనాలు కొనొద్దు. పత్తి ఇప్పుడే సాగు చేయొద్దు. వేడిలో పెడితే విత్తనాలు పాడవుతాయి, ఎలుకలు వంటి జీవరాశులు తింటాయి. 100 మిల్లీమీటర్ల వర్షం పడిన తర్వాతే విత్తాలి.

ప్రశ్న : పసుపు సాగు చేయాలి సూచనలివ్వండి. అంతర్‌ పంటలు వేసుకోవచ్చా? – అనూష, దామెర

జవాబు: ప్రస్తుతం విత్తొద్దు. ఎండలు కొడుతుండడంతో భూమిలో వేడి అధికంగా ఉంది. బాగా వర్షాలు కురిసి నేలలో కావాల్సిన తేమ ఉన్నప్పుడే విత్తాలి. భూమిలో పశువుల, మేకల ఎరువు వేసి కలియదున్ని సిద్ధంగా ఉంచుకోవాలి. పసుపులో అనేక రకాల తెగుళ్లు వస్తాయి. దుంపకుళ్ల తెగులు ఎక్కువగా వస్తుంది. దీని నివారణకు ట్రైకోవిర్మిడితో విత్తన శుద్ధి చేసుకోవాలి. అంతర పంటగా మొక్కజొన్న, పెసర వంటివి సాగు చేసుకోవచ్చు.

ప్రశ్న : మిరప సాగు చేస్తున్నాం. వేరుకుళ్లు తెగులు బాగాఎక్కువగా ఉన్నాయి. – నారాయణరావు, నడికూడ

జవాబు: మిరప సాగు చేసిన భూమిలో రొట్ట మీద బూజు వచ్చినట్లు నేలలోపల బూజు వస్తుంది. ఒకసారి మిరప సాగు చేశామంటే పంట మార్పిడి చేయాలి. మొక్కజొన్న, పెసర వంటి పంటలు వేస్తే నేలలోని విషపూరిత బూజు పోతుంది. ట్రైకోడర్మివిరిడిని ఏదేని ఎరువులు కలుపుకుని, కొంచెం బెల్లం పాకం కలిపి తడి బాగా ఉన్న సమయంలో భూమిలో వేసి కలియదున్నాలి. అప్పుడే భూమిలో వేరుకుళ్లు అవశేషాలు పూర్తిగా నశిస్తాయి.

ప్రశ్న : పెసర్లు వేస్తే బాగుంటుందా? జీలుగ వేస్తే బాగుంటుందా?

– మేకల కేదారి యాదవ్‌, సోమిడి, కాజీపేట

జవాబు: పెసర్లు వేసుకుంటే వానలు పడకముందే పంట సేకరించడం ద్వారా ఆదాయం వస్తుంది. జీలుగ వేస్తే కేవలం పచ్చిరొట్టగానే పని చేస్తుంది. తెలంగాణ సీడ్స్‌ కార్పొరేషన్‌లో విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా చెర్లపల్లికి చెందిన బి.సదయ్య, ధర్మసాగర్‌నుంచి టేకుమట్ల విష్ణు, కమలాపూర్‌నుంచి కుమార్‌, గొట్టె శ్రీనివాస్‌, దామెర మండలం ల్యాదెళ్లనుంచి సాంబరాజు, ఆత్మకూరు మండలం అక్కంపేట నుంచి రేగుల రవీందర్‌, తిరుమలగిరి నుంచి మనోహర్‌, దామెర నుంచి గుండెకారి నాగేశ్వర్‌రావు, ఆత్మకూరు నుంచి జయపాల్‌రెడ్డి, వేలేరు మండలం శాలపల్లినుంచి పీచర సుధాకర్‌.. సాగులో సమస్యలు తెలపగా అధికారులు సమాధానాలిచ్చారు.

సమృద్ధిగా వర్షాలు పడ్డాకే వేయాలి

వరిలో మధ్యకాలిక, స్వల్పకాలిక రకాల

సాగు మేలు

పచ్చిరొట్ట ఎరువుకు పెసరు బాగు

‘సాక్షి’ ఫోన్‌ ఇన్‌లో హనుమకొండ జిల్లా

వ్యవసాయ అధికారులు విజయ్‌చంద్ర, ఆదిరెడ్డి, శాస్త్రవేత్త నర్సయ్య

Advertisement
 
Advertisement
Advertisement