మహిళా సాధికారతకు సమాఖ్య భవనాలు | - | Sakshi
Sakshi News home page

మహిళా సాధికారతకు సమాఖ్య భవనాలు

Jun 12 2026 7:19 AM | Updated on Jun 12 2026 7:19 AM

గోవిందరావుపేట: మహిళా ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబించి అధిక లాభాలు పొందాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క అన్నారు. గురువారం మండలంలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె.. మహిళా సంఘాల బలోపేతం, రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. ముందు లక్నవరం గ్రామంలో మహిళా సంఘాల సమాఖ్య భవనాల నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. అనంతరం సోమలగడ్డ క్రాస్‌ సమీపంలోని పీఎస్‌ఆర్‌ గార్డెన్‌లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి మెగా రైతు మేళాకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. సంప్రదాయ సాగుతో పాటు ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబించి ఉత్పాదకత పెంచుకోవాలని సూచించారు. రసాయన వినియోగాన్ని తగ్గించి సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, పంట మార్పిడి ద్వారా భూసారాన్ని కాపాడుకుంటూ అధిక దిగుబడులు సాధించాలని రైతులకు సూచించారు. ములుగు జిల్లాలో ఆయిల్‌ పామ్‌ సాగు వేగంగా విస్తరించడ సంతోషకరమన్నారు. తక్కువ ఖర్చుతో అధిక ఆదాయం పంటగా రైతులు దీనిని స్వీకరించాలని సూచించారు. అనంతరం ఉత్తమ రైతులను మంత్రి సీతక్క, ఆయిల్‌ ఫెడ్‌ చైర్మన్‌ జంగా రాఘవ రెడ్డి, కలెక్టర్‌ హేమంత్‌ సహదేవరావు సన్మానించి అభినందించారు. ఆయా కార్యక్రమాల్లో గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ బానోత్‌ రవిచందర్‌ నాయక్‌, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేగ కల్యాణి, జిల్లా అధికారులు, శాస్త్రవేత్తలు, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, రైతులు పాల్గొన్నారు.

రైతుల అభివృద్ధికి ఆధునిక సాగు మార్గం

రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ

మంత్రి సీతక్క

Advertisement
 
Advertisement
Advertisement