హన్మకొండ: ఆర్టీసీ జేబీఎం విద్యుత్ బస్సులను బ్యాటరీ సమస్యలు వేధిస్తున్నాయి. 75 రోజుల వ్యవధిలో రెండు సార్లు బ్యాటరీల్లో మంటలు వచ్చాయి. దీంతో మార్గమద్యలో బస్సులు నిలిచి విసిగి పోతుండగా మరో వైపు బ్యాటరీల్లో షార్ట్ సర్క్యూట్‌తో వస్తున్న మంటలు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఎప్పుడు ఏ బస్సులో మంటలు వస్తాయో, ఎక్కడ తగులబడుతాయోననే ఆందోళనల మధ్య అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. టీజీఎస్ ఆర్టీసీ వరంగల్–2 డిపోలో 115 విద్యుత్ బస్సులున్నాయి. మార్చి 28న రాత్రి టీజీ 03 టీ 1260 ఎలక్ట్రిక్ బస్ బ్యాటరీ నుంచి మంటలు ఎగిసిపడగా అగ్నిమాపక సిబ్బంది చేరుకుని ఆర్పారు. ఈ ఘటనలో ఏడు బ్యాటరీలకు నష్టం కలిగింది. కాగా, ఇదిలా ఉండగా బుధవారం రాత్రి టీజీ 03 టీ 2209 బస్సుకు చార్జ్ పెట్టగా రెండు గంటల్లో పూర్తయి వెంటనే బ్యాటరీ నుంచి పొగలు వ్యాపించాయి. వెంటనే గమనించిన సిబ్బంది ఆపే ప్రయత్నం చేస్తుండగా మంటలు లేచాయి. వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించగా సిబ్బంది చేరుకుని మంటలు ఆర్పారు. ఈ ఘటనలో రెండు బ్యాటరీలు దెబ్బతిన్నాయి. మంటలు వెంటనే ఆర్పకపోతే ఈ బస్సుతో పాటు పక్కన ఉన్న బస్సులు మంటలకు దగ్గమయ్యేవి. సిబ్బంది వెంటనే అప్రమత్తం కావడంతో భారీ ముప్పు తప్పింది. ఈ ఘటనతో 75 రోజుల్లో రెండు సార్లు జేబీఎం బస్సులో బ్యాటరీల్లో మంటలు లేచాయి. దీంతో ఇలాంటి ఘటనలు ఎన్ని జరుగుతాయోననే సిబ్బంది ఆందోళనలో ఉన్నారు.
బుధవారం రాత్రి మంటలు
సిబ్బంది అప్రమత్తం.. తప్పిన పెనుముప్పు


