న్యూస్‌రీల్
ఇదీ జీడబ్ల్యూఎంసీ పన్ను వసూళ్ల లక్ష్యం
● కార్యాచరణ సిద్ధం చేసిన
రెవెన్యూ అధికారులు
● చెల్లింపుదారులకు ఎస్‌ఎంఎస్‌లు,
ఫోన్లలో సమాచారం
● త్వరలో ముగియనున్న
ఆర్థిక సంవత్సరం
వరంగల్ అర్బన్: ఆర్థిక సంవత్సరం మరో 20 రోజుల్లో ముగియనుంది. దీంతో ఆస్తిపన్ను వసూళ్లను జీడబ్ల్యూఎంసీ వేగవంతం చేస్తోంది. ఇక నుంచి రోజూవారీగా రూ.1.50 కోట్ల చొప్పున నెలాఖరులోగా రూ.30 కోట్లు వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో నగర వ్యాప్తంగా ఆస్తిపన్ను అసెస్‌మెంట్లు 2,28,753 కాగా.. ఈ ఏడాది ఆస్తిపన్ను రూ.81.58 కోట్లు, వడ్డీ రూ.47.06 కోట్లు, పాత బకాయిలు రూ.49.55 కోట్లు. మొత్తంగా రూ.178.19 కోట్లు వసూళ్ల లక్ష్యంగా పెట్టుకున్నారు. 15వ ఆర్థిక సంఘం ఆదేశాల మేరకు ఈ ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను, బకాయిల్లో నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాల్సిందేనని మేయర్ గుండు సుధారాణి, ఇన్‌చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ రెవెన్యూ సిబ్బందికి సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చారు. వసూళ్లలో వెనుకబడితే శాఖాపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. దీంతో బల్దియా పన్నుల వసూళ్లలో దూకుడు పెంచారు.
జీడబ్ల్యూఎంసీలో ప్రత్యేక వ్యవస్థ..
పన్నులు చెల్లించాల్సిన వ్యక్తులను అప్రమత్తం చేస్తూ మొబైల్ ఫోన్లకు ఎస్‌ఎంఎస్‌లతో సమాచారం ఇస్తున్నారు. ఇందుకోసం జీడబ్ల్యూఎంసీలో ప్రత్యేక వ్యవస్థ పనిచేస్తోంది. రూ.లక్షకు పైగా పన్ను చెల్లించాల్సిన వ్యక్తులు, సంస్థలకు జీడబ్ల్యూఎంసీలోని డిప్యూటీ కమిషనర్ కార్యాలయాల నుంచి ఉద్యోగులు నేరుగా ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు. నెలాఖరులోగా పన్నులు చెల్లించి సహకరించాలని సూచిస్తున్నారు. లేదంటే వడ్డీతోపాటు చట్ట ప్రకారం తీసుకోనున్న చర్యలను వివరిస్తున్నారు. మొండిబకాయిల వసూళ్ల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. వింగ్ అధికారులు, గెజిటెడ్ అధికారులను సర్కిళ్ల వారీగా ఇన్‌చార్జులుగా నియమించారు. ఆస్తి, నీటి పన్ను వసూళ్లపై కఠినంగా వ్యవహరిస్తోంది. బకాయిదారులపై కొరడా ఝుళిపిస్తున్నారు. పేద, మధ్య తరగతి వర్గాల నుంచి జబర్దస్తీగా వసూలు చేస్తున్నారు. పేదల ఇళ్ల తలుపులు, ఇతర వస్తువులు జప్తు చేస్తున్నారు. నల్లా కనెక్షన్లు, గ్యాస్ సిలిండర్లు సీజ్ చేస్తుండడంతో తీవ్ర నిరసన తెలుపుతున్నారు. బకాయిలు చెల్లించకుండా మొండికేస్తున్న వారికి రెడ్‌నోటీస్‌లు, వారెంట్లు జారీ చేస్తున్నారు. ఏళ్ల తరబడి పన్ను కట్టని వారికి లీగల్ నోటీసులు ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు. వారం రోజులుగా గ్రేటర్ పన్నుల అధికారులు, సిబ్బంది ఆస్తి, నీటి పన్నుల వసూళ్లల్లో దూకుడు పెంచారు. బకాయిలు చెల్లించకుండా ఒత్తిడి తెచ్చేవారికి, రాజకీయ నేతలతో ఒత్తిడి తెచ్చే వారిని గుర్తించి ఆస్తుల జప్తుల కోసం రెడ్‌నోటీసులు జారీ చేస్తున్నారు.
ఆగమాగం.. అయోమయం
రాష్ట్ర పురపాలకశాఖ ఆదేశాల మేరకు మేరకు 2023 నుంచి ఆస్తి, నీటి, ట్రేడ్ లైసెన్స్ కార్యకలపాలను ‘ఆన్‌లైన్’ ద్వారా సెంట్రల్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) పర్యవేక్షిస్తోంది. గతంలో బల్దియా సొంత వైబ్‌సైట్ నుంచి పన్నుల మదింపు, వసూళ్లు తదితర అంశాలకు ఇక్కడే పరిష్కారం లభిస్తుండేది. ప్రస్తుతం సీజీజీ పన్ను అసెస్‌మెంట్లు, డిమాండ్ ఎక్కువ చూపెడుతోంది. వసూళ్లు తక్కువ చూపెడుతోంది. దీంతో బల్దియా అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 34వ డివిజన్‌కు చెందిన ఒక బిల్ కలెక్టర్ తన పరిధిలో డిమాండ్ రూ.1,23 కోట్లు పన్నుల వసూలు చేయగా.. సీజీజీ విడుదల చేసిన పత్రాల్లో రూ.52 లక్షలు మాత్రమే వసూలు చేసినట్లు ధ్రువీకరిస్తున్నారు. ఇలా ఆస్తి, నల్లా పన్నులు, డిమాండ్ లెక్కల్లో గందరగోళంగా మారాయి. అంతేకాకుండా బల్దియా అధికారులు 65 శాతం పైచిలుకు పన్నులు వసూలు చేసినట్లు చెబుతుండగా.. సీజీజీ సంస్థ నుంచి మాత్రం ఆస్తిపన్ను కేవలం 27 శాతం, నీటి పన్నులు 20 శాతం వసూలైనట్లుగా నివేదికలు అందిస్తున్నారు. దీంతో లెక్కలకు పొంతన లేకపోవడంతో హైరానా పడుతున్నారు. పన్నుల వసూళ్లలో హ్యాండ్ మిషన్లు సాంకేతిక లోపంతో మొరాయిస్తున్నాయని బిల్‌కలెక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈలోపాలు పన్నుల వసూళ్లపై ప్రభావం పడుతోందని అంటున్నారు.


