సాక్షి ప్రతినిధి, వరంగల్:
దేశవ్యాప్తంగా త్వరలో జనగణన చేపట్టనున్నారు. ఈనేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనాభా వివరాలపై మళ్లీ చర్చ మొదలైంది. చివరిసారిగా 2011లో జరిగిన జనగణనలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం జనాభా 35,12,576గా నమోదైంది. వాస్తవానికి మళ్లీ 2021లో జనగణన చేపట్టాల్సింది. కరోనాతో అది జరగలేదు. అప్పటి నుంచి 15 ఏళ్లలో జనాభా గణనీయంగా పెరిగినట్లు అంచనాలు చెబుతున్నాయి. అధికారిక గణాంకాలు వెలువడితే ఉమ్మడి జిల్లాలో జనాభా 38 లక్షలు దా టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
జిల్లాల పునర్విభజన తర్వాత మొదటిసారి..
ఉమ్మడి వరంగల్‌ను హనుమకొండ, వరంగల్ , జనగామ, జేఎస్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాలుగా విభజించారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత జరగనున్న ఇది మొదటి పూర్తిస్థాయి జనగణన కావడం విశేషం. కాగా, కొత్త జిల్లాల వారీగా మొదటి పూర్తి డేటా జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత మొదటిసారిగా జరగనున్న ఈ జనగణనలో ప్రతి జిల్లాకు విడిగా పూర్తి గణాంకాలు వెలువడనున్నాయి. దీంతో అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడానికి ప్రభుత్వానికి స్పష్టమైన సమాచారం అందనుంది.
దశాబ్దంలో పెరిగిన పట్టణీకరణ..
2011 గణాంకాల ప్రకారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత దశాబ్దంలో పట్టణీకరణ వేగంగా పెరిగింది. ముఖ్యంగా వరంగల్–హనుమకొండ ప్రాంతాల్లో జనాభా పెరుగుదల ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. పట్టణాలకు వలసలు, విద్య అవకాశాలు, పరిశ్రమలు, ప్రభుత్వ ఉద్యోగాలు పెరగడమే ఇందుకు కారణమని చెబుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో ఏర్పాట్లు..
ఉమ్మడి 6 జిల్లాల్లో పకడ్బందీగా జనగణన చేపట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ దశ 11 మే 2026న ప్రారంభమై 9 జూన్ 2026 వరకు కొనసాగుతుంది. రెండో దశలో జనాభా గణన (పాపులేషన్ ఎన్యుమరేషన్) ప్రక్రియ ఫిబ్రవరి 2027లో నిర్వహిస్తారు. 1 మార్చి 1 2027ను రిఫరెన్స్ తేదీగా పరిగణిస్తారు. కాగా, రెండు విడతల్లో చేపట్టే జనగణనలో ఉమ్మడి జిల్లా నుంచి వేలాది మంది సర్వేయర్లు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో వారందరికీ మంగళవారం నుంచి మూడు రోజుల శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ), జిల్లా రెవెన్యూ అధికారి, డీఎఫ్‌ఓ, ఆర్డీఓలు, వరంగల్ మహానగర పాలకసంస్థ, మున్సిపల్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, అధికారులు పాల్గొంటున్నారు.
అక్షరాస్యత
65.11%
గ్రామీణ జనాభా
71.7%
పట్టణ జనాభా
28.3%
కరోనాతో వాయిదా.. 15 ఏళ్ల తర్వాత త్వరలో శ్రీకారం
కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత మొదటిసారి వివరాల నమోదు
ఉమ్మడి వరంగల్ జిల్లా జనాభా 38 లక్షలు దాటే అవకాశం
పట్టణీకరణతో వరంగల్, హనుమకొండలో
జనాభా భారీగా పెరుగుదల
డిజిటల్‌గా జనగణన..
జనగణన ఈసారి పూర్తిగా డిజిటల్ విధానంలో చేపట్టే అవకాశం ఉంది. గతంలో మాదిరిగా కాగితపు దరఖాస్తుల స్థానంలో సర్వేయర్లు మొబైల్ యాప్‌ల ద్వారా సమాచారాన్ని నమోదు చేయనున్నారు. దీంతో డేటా సేకరణ వేగంగా పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. జనగణనలో ప్రతి ఇంటి కుటుంబ వివరాలు, విద్యస్థాయి, ఉద్యోగం, గృహ పరిస్థితులు తదితర అంశాలను నమోదు చేస్తారు. కొత్తగా ఆన్‌లైన్ ద్వారా స్వయంగా వివరాలు నమోదు చేసే అవకాశం కూడా కల్పించే యోచన ఉంది. కాగా, సర్వేలో ఇల్లు, కుటుంబ సభ్యుల సంఖ్య, వయస్సు, లింగం, విద్యస్థాయి, ఉద్యోగం/వృత్తి, ఇల్లు సొంతమా అద్దెనా, తాగునీరు, మరుగుదొడ్డి వంటి సదుపాయాలు.. తదితర 33 ప్రశ్నలతో వివరాలు సేకరించనున్నారు. రెండు విడతల్లో జనగణన సర్వే జరుగుతుంది.


