చేనేత ఉత్పత్తుల కొనుగోలుకు టెండర్‌ వద్దు | - | Sakshi
Sakshi News home page

చేనేత ఉత్పత్తుల కొనుగోలుకు టెండర్‌ వద్దు

Mar 12 2026 7:49 AM | Updated on Mar 12 2026 7:49 AM

చేనేత ఉత్పత్తుల కొనుగోలుకు టెండర్‌ వద్దు

కాశిబుగ్గ: చేనేత ఉత్పత్తుల కొనుగోళ్లకు కొత్తగా టెండర్‌ విధానం అమలు చేయవద్దని వరంగల్‌ కొత్తవాడకు చెందిన చేనేత సహకార సంఘాల ప్రతినిధులు కోరారు. ఈ మేరకు బుధవారం వారు హుస్నాబాద్‌లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చేనేత సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో ఉత్పత్తి అవుతున్న కార్పెట్స్‌ బెడ్‌షీట్స్‌, బెడ్డింగ్‌ మెటీరియల్‌ను టెండర్‌ విధానం ద్వారా ప్రైవేట్‌ వ్యక్తులు, కాంట్రాక్టర్లకు ఇస్తే 60వేల చేనేత కుటుంబాలు రోడ్డున పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ చేనేత కార్మికులకు అన్యాయం జరగకుండా చూసుకుంటానని, ఎవరూ ఆందోళన చెందవద్దని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీపీసీసీ చేనేత విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చిప్ప వెంకటేశ్వర్లు, చేనేత విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గాజుల భగవాన్‌, చేనేత సహకార సంఘాల సమాఖ్య అధ్యక్షుడు పంతగాని శ్రీనివాస్‌, అడిగొప్పుల సంపత్‌, దూబల రాజేందర్‌, ఆడెపు రవి, ఝెలుగం సాంబయ్య, పరికిపండ్ల రమేశ్‌, కూచన ఓదెలు పాల్గొన్నారు.

చేనేత పరిశ్రమను పరిరక్షించాలి

చేనేత పరిశ్రమ పరిరక్షణకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని లంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు తాటిపాములు వెంకట్రాములు, ప్రధాన కార్యదర్శి పాశికంటి లక్ష్మీనర్సయ్య కోరారు. ఈ మేరకు బుధవారం వారు హైదరాబాద్‌లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, శాసనమండలి సభ్యుడు నెల్లికంటి సత్యంకు వినతిపత్రాలు అందజేసి మాట్లాడారు. 13 సంవత్సరాలుగా ఎన్నికలు లేకపోవడంతో చేనేత సహకార సంఘాలు నిర్వీర్యం అవుతున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాంబశివరావు, ఎమ్మెల్సీ సత్యం మాట్లాడుతూ చేనేత సమస్యలను తప్పకుండా చట్టసభల్లో ప్రస్తావించి, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement