హన్మకొండ అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 6 నుంచి జూన్ 12వ తేదీ వరకు నిర్వహించనున్న 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని హనుమకొండ జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం వివిధ శాఖల జిల్లా అధికారులు, మండల అభివృద్ధి అధికారులతో నిర్వహించిన సమీక్షలో కార్యాచరణపై దిశా నిర్దేశం చేశారు. శాఖల వారీగా అమలు చేయాల్సిన అంశాలను సమీక్షించి స్పష్టమైన సూచనలిచ్చారు. అదనపు కలెక్టర్ రవి, డీఆర్‌ఓ సత్యపాల్‌రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.
పన్ను చెల్లింపులకు రాయితీ ఉండదు..
ఆస్తి పన్ను, నీటి పన్ను చెల్లింపులపై ఎలాంటి రాయితీ లేదా వడ్డీ మాఫీ అవకాశం లేదని హనుమకొండ కలెక్టర్, నగర పాలక సంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ స్పష్టం చేశారు. ప్రజలు తక్షణమే పన్నులు చెల్లించి నగరాభివృద్ధికి సహకరించాలని కోరారు. నగర పాలక సంస్థ అధికారులతో పన్నుల వసూళ్లపై సమీక్షించారు. ఈసందర్భంగా పనుల చెల్లింపులో రాయితీలు ఉంటాయనే అపోహలు ప్రచారంలో ఉన్నాయని అలాంటి అవకాశం లేదని వివరించారు. రూ.34 కోట్ల పన్ను బకాయిల వసూళ్లకు ప్రయత్నించాలని ఆదేశించారు.
సోలార్ విద్యుత్ వినియోగంపై..
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని గృహ విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకో వాలని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ సూచించారు. కలెక్టరేట్‌లో పథకం అమలుపై పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రచార వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు.
వరంగల్ జిల్లాలో..
న్యూశాయంపేట: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక అమలుకు పటిష్ట కార్యాచరణ రూపొందించి జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశపు హాల్‌లో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 6 నుంచి జూన్ 12 వరకు ఐదు దశల్లో 99 రోజులపాటు వివిధ శాఖలకు సంబంధించిన 10 ముఖ్య అంశాలపై కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 6న ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయిలో కార్యాచరణపై మంత్రుల సమీక్ష సమావేశం ఉంటుందని వెల్లడించారు. సంబంధిత అధికారులు పూర్తి వివరాలతో హాజరు కావాలని ఆదేశించారు. ప్రతీరోజు నిర్వహించిన కార్యక్రమాల వివరాలను రోజువారీ ప్రగతి నివేదిక రూపంలో సమర్పించాలన్నారు. ప్రతిస్థాయిలో నోడల్ అధికారులను నియమించి రోజువారీ పర్యవేక్షణ ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో డీఎఫ్‌ఓ అనూజ్ అగర్వాల్, అదనపు కలెక్టర్లు బి.సంధ్యారాణి, వైవీ గణేశ్, డీఆర్‌ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ఉప కమిషనర్ ప్రసన్నరాణి, నర్సంపేట, వరంగల్ ఆర్డీఓలు ఉమారాణి, సుమ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


