కాశిబుగ్గ: గ్రేటర్ వరంగల్ 19వ డివిజన్ పరిధిలోని కాశిబుగ్గలో మూడు రోజుల నుంచి నల్లా నీళ్లు పసుపురంగులో సరఫరా అవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దుర్వాసన కూడా వస్తున్నాయని, వీటిని ఎలా తాగాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైపులైన్ అస్తవ్యస్తంగా మారి తాగునీరు శుభ్రంగా లేకపోవడంతో తాగాలంటే భయమవుతోందని చెబుతున్నారు. అసలే వేసవికాలం.. ఇలాంటి నీళ్లు తాగి అనారోగ్యాల బారిన పడితే ఎవరు పట్టించుకుంటారని ప్రశ్నిస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి రంగునీళ్లు సరఫరా జరిగిన సమయంలో మేయర్, అధికారులు సంబంధిత ఫిల్టర్ బెడ్‌ను సందర్శించి పరిశీలించారు. తర్వాత శుభ్రమైన నీటిని అందించారు. ప్రస్తుతం వారు స్పందించి స్వచ్ఛమైన నీటిని సరఫరా చేయాలని స్థానికులు కోరుతున్నారు.


