సొంత సంస్థకు కన్నం!
హన్మకొండ: విద్యుత్ చౌర్యానికి పాల్పడకుండా చూడాల్సిన ఓ వ్యక్తి కక్కుర్తి పడి సంస్థ ఆదాయానికి కన్నం వేశాడు. టీజీ ఎన్పీడీసీఎల్ భూపాలపల్లి సర్కిల్‌లోని ఎమ్మార్టీ డివిజన్‌కు చెందిన ఓ ఉద్యోగి తన గృహానికి టెస్టింగ్ మీటర్లు మారుస్తూ విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నాడు. ఎన్పీడీసీఎల్ డీపీఈ విభాగం తనిఖీల్లో సర్వీస్ నంబర్‌కు మంజూరు చేసిన మీటర్ నంబర్ తేడాగా ఉండడంతో మీటర్ మార్చిన బాగోతం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. భూపాలపల్లి ఎమ్మార్టీ డివిజన్‌లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి హనుమకొండలోని రాయపురలో నివాసముంటున్నాడు. కరెంట్ బిల్లు తక్కువ వచ్చేందుకు అసలు మీటర్ స్థానంలో టెస్టింగ్ మీ టర్లను మారుస్తున్నాడు. డీపీఈ విభాగం అధికారులు సాధారణ తనిఖీల్లో భాగంగా రాయపురలోని ఆ ఉద్యోగి ఇంట్లోని మీటర్‌ను తనిఖీ చేయగా సర్వీస్ నంబర్‌కు, కేటాయించిన మీటర్ నంబర్ తేడాగా ఉండడం గమనించారు. కూపీలాగితే అసలు మీటర్ మార్చినట్లు వెలుగు చూసింది. అతడికి రూ.1.30 లక్షల జరిమానా విధించినట్లు సమాచారం. ఈ ఉద్యోగి ఏడాదికాలంగా మీటర్లు మారుస్తూ విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నట్లు తెలిసింది. అతడిపై టీజీ ఎన్పీడీసీఎల్ భూపాలపల్లి సర్కిల్ సూపరింటెంటెండ్ ఇంజనీర్, ఎమ్మార్టీ డీఈలకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
టెస్టర్‌గా పనిచేస్తుండడంతో సులువుగా మీటర్ మార్పు..
సాధారణంగా గృహ విద్యుత్ వినియోగదారులు తమ మీటర్లలో లోపాలుంటే అందులోని వైఫల్యాన్ని గుర్తించడానికి రూ.200 ఆపరేషన్ డీఈ పేరుతో ఫీజు చెల్లించి సెక్షన్‌లో దరఖాస్తు చేసుకుంటాడు. ఈ మీటర్‌ను పరీక్షించేందుకు ఎమ్మార్టీ విభాగం ల్యాబ్‌కు పంపిస్తారు. ఇక్కడ టెస్టర్‌గా విధులు నిర్వహించే ఉద్యోగి ఆ మీటర్‌కు సాంకేతిక పరీక్షలు నిర్వహించి మీటర్ బాగుందా లేదో తేలుస్తాడు. భూపాలపల్లి ఎమ్మార్టీ డివిజన్‌లో టెస్టర్‌గా పనిచేస్తున్న ఓ ఉద్యోగి టెస్టింగ్ కోసం వచ్చిన మీటర్లను తన ఇంటికి తీసుకెళ్లి తన మీటర్ స్థానంలో టెస్టింగ్ మీటర్‌ను అమరుస్తూ విద్యుత్ వాడుకుంటున్నాడు. రీడింగ్ తీయడానికి కొన్ని రోజుల ముందు యథావిధిగా పాత మీటర్‌ను అమర్చుతున్నాడు. ఈ మీటర్‌లో రీడింగ్ తక్కువ నమోదు అవుతుండడంతో బిల్లు కూడా తక్కువగా వస్తోంది.
బిల్లు తగ్గించుకోవడానికి
ఎన్పీడీసీఎల్ ఉద్యోగి నిర్వాకం
సొంతింటికి టెస్టింగ్ మీటర్ల వినియోగం
ఎమ్మార్టీలో పనిచేస్తుండడంతో
సులువుగా మీటర్ మార్పు
బిల్లు తీసేనాటికి సొంత మీటర్
అమర్చుతున్న ఉద్యోగి
డీపీఈ తనిఖీల్లో వెలుగు చూసిన అక్రమం


