పాత నేరస్తులపై నిఘా పెట్టండి
రామన్నపేట: గతంలో చోరీలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగలపై నిఘా ఉంచాలని సీసీఎస్ పోలీసులను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా.. శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ సిటీ క్రైంస్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. సీసీఎస్‌కు చేరుకున్న సీపీకి అధికారులు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది కిట్ ఆర్టికల్స్, పాత నేరస్తుల ఫొటోలు, స్టేషన్ రికార్డులు పరిశీలించి చోరీల నివారణకు తీసుకుంటున్న చర్యలను సంబంధిత స్టేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. చోరీల నియంత్రణకు చేపట్టాల్సిన ముందస్తు చర్యలను అధికారులకు సూచించారు. అనంతరం సీపీ సన్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. చోరీ కేసుల్లో జైలు నుంచి విడుదలైన నిందితుల సమాచారం సేకరించాలని, ఇతర రాష్ట్రాల్లో చోరీ కేసుల్లో పట్టుబడిన వారి వివరాలు అందుబాటులో ఉంచుకో వాలని సూచించారు. తనిఖీల్లో క్రైం అదనపు డీసీపీ బాలస్వామి, ఏసీపీ సదయ్య, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్లు రాఘవేందర్, రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.
స్పందించిన ఎంజీఎం పరిపాలనాధికారులు
ఎంజీఎం : వరంగల్ కేఎంసీ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిలో కార్డియాలజీ విభాగంలోని క్యాథ్‌లాబ్ పరికరం శుక్రవారం అందుబాటులోకి వచ్చింది. గత మూడు రోజులుగా పరికరంలో ఏర్పడిన సాంకేతిక లోపంతో హృద్రోగులకు అంజియోగ్రామ్, స్టంట్ సేవలు నిలిచిపోయాయి. ఆరోగ్యశ్రీలో అంజియోగ్రామ్ సేవల కోసం రిజిస్ట్రేషన్ చేసిన సుమారు 30మంది రోగులను ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి సహకారంతో గురువారం రాత్రి నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కాగా, ప్రస్తుతం క్యాథ్‌ల్యాబ్ సేవలు అందించేందుకు సదరు కంపెనీకి 18 నెలల నుంచి మరమ్మతుల బిల్లులు సుమారు రూ.42లక్షల వరకు చెల్లించకపోవడంతో మూడు రోజులుగా ఆ కంపెనీ ప్రతినిధులు స్పందించలేదు. రోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ప్రతినిధులతో ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ హరిశ్చంద్రారెడ్డి మాట్లాడారు. బిల్లులు చెల్లింపు జరిగేలా రాష్ట్రస్థాయి అధికారులతో మాట్లాడతామని సర్దిచెప్పారు. దీంతో ప్రతినిధులు క్యాథ్‌ల్యాబ్‌లో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని సరిచేయడంతో తిరిగి హృద్రోగులకు అంజియో, స్టంట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
● సీపీ సన్‌ప్రీత్ సింగ్
● సిటీ క్రైం స్టేషన్ తనిఖీ


