జీడబ్ల్యూఎంసీలో డివిజన్లు పెంచండి
సీఎం రేవంత్‌కు ఎమ్మెల్యేలు, మేయర్ వినతి
హన్మకొండ చౌరస్తా: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 66 డివిజన్ల సంఖ్యను జనాభా, విస్తీర్ణం ఆధారంగా మరిన్ని పెంచాలని ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, మేయర్ గుండు సుధారాణి శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. హైదరాబాద్‌లోని సెక్రెటేరియెట్‌లో వారు సీఎం రేవంత్, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా డివిజన్ల పెంపు, కాజీపేట బస్‌స్టేషన్ నిర్మాణానికి అవసరమైన భూకేటాయింపు ప్రక్రియను రైల్వేశాఖ ద్వారా వేగవంతం చేయాలని కోరారు. రైల్వే స్టేషన్ ఆవరణలో రైల్వే అధికారులు సర్వే నిర్వహించారని, తదుపరి చర్యలు త్వరితగతిన చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. భద్రకాళీ ఆలయ అభివృద్ధి అంశాన్ని వివరించారు. భద్రకాళి అమ్మవారి దర్శనానికి వరంగల్‌కు రావాలని కోరారు. కాగా, వరంగల్ నగరాభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి భరోసా కల్పించినట్లు తెలిపారు.


