ఇక.. ఇక్కట్‌లకు చెక్
హన్మకొండ : విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా టీజీ ఎన్పీడీసీఎల్ ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తోంది. నూతన సాంకేతికను అందిపుచ్చుకుంటూ మెరుగైన, నాణ్యమైన, అంతరాయాలు లేని విద్యుత్ సరఫరా అందించమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో విద్యుత్ సబ్ స్టేషన్లు, 33 కేవీ, 11 కేవీ విద్యుత్ లైన్ల అనుసంధానం చేస్తోంది. నిరంతర విద్యుత్ సరఫరాలో ఆటంకాలు లేకుండా ఉండేందుకు ఇంటర్ లింకింగ్ ప్రక్రియ చేపట్టింది. దీని ద్వారా విద్యుత్ వ్యవస్థ బలోపేతం కానుంది. ఇందులో భాగంగా ఒక సబ్ స్టేషన్ నుంచి మరో సబ్ స్టేషన్ మధ్య విద్యుత్ లైన్లు అనుసంధానం చేస్తున్నారు. అదే విధంగా 33 కేవీ, 11 కేవీ విద్యుత్ ఫీడర్ల మధ్య అనుసంధానం చేస్తున్నారు. దీంతో ప్రధాన లైన్‌లో సమస్య ఉత్పన్నమైతే వెంటనే ప్రత్యామ్నాయ లైన్ ద్వారా సాధ్యమైనంత త్వరగా విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తారు.
16 సర్కిళ్ల పరిధిలో 269 ఇంటర్ లింకింగ్ పనులు..
టీజీ ఎన్పీడీసీఎల్ వ్యాప్తంగా 16 సర్కిళ్ల పరిధిలో 269 ఇంటర్ లింకింగ్ పనులు చేపట్టాలని ప్రణాళిక రూపొందించుకుని ముందుకెళ్తున్నారు. ఇందులో ఇప్పటి వరకు 164 పనులు పూర్తయ్యాయి. మిగతా 105 పనులు వేగంగా సాగుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 57 ఇంటర్ లింకింగ్ పనుల లక్ష్యం విధించుకోగా ఇప్పటి వరకు 27 పూర్తయ్యాయి. ఇంకా 30 పనులు జరుగుతున్నాయి. హనుమకొండ సర్కిల్‌లో మొత్తం 6 ఇంటర్ లింకింగ్ పనులకు ఒకటి మాత్రమే పూర్తి కాగా 5 పురోగతిలో ఉన్నాయి. వరంగల్ సర్కిల్‌లో మొత్తం 15 ఇంటర్ లింకింగ్ పనులకు గాను 9 పూర్తికాగా 6 పనులు కొనసాగుతున్నాయి. జనగామలో 13 ఇంటర్ లింకింగ్ పనులకు 10 పూర్తయ్యాయి. మూడు పనులు సాగుతున్నాయి. భూపాలపల్లి సర్కిల్‌లో 15 ఇంటర్ లింకింగ్ పనులకు గాను 3 పూర్తి కాగా మరో 12 పనులు పురోగతిలో ఉన్నాయి. మహబూబాబాద్ సర్కిల్‌లో 8 ఇంటర్ లింకింగ్ పనులకు 4 పూర్తికాగా, మరో 4 పనులు పురోగతిలో ఉన్నాయి.
ఇంటర్ లింకింగ్‌తో
విద్యుత్ అంతరాయాలకు బ్రేక్..
ప్రకృతి వైఫరీత్యాలు, నిర్వహణ
సమయంలోనూ నిరంతర సరఫరా
ఒక సబ్ స్టేషన్‌లో సరఫరా నిలిచిపోతే మరో సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్..
33 కేవీ, 11 కేవీ విద్యుత్ లైన్లలో
వేగంగా కొనసాగుతున్న పనులు
ఇక.. ఇక్కట్‌లకు చెక్


