ఓరుగల్లు సంప్రదాయాన్ని కాపాడుకోవాలి
హన్మకొండ అర్బన్: కళల కాణాచిగా నిలిచిన ఓరుగల్లు సంప్రదాయాన్ని కాపాడుకోవాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. కళలను కాపాడుకోవాలని, సాహిత్య–సాంస్కృతిక కార్యక్రమాలను ప్రజలు ఆదరించాలని పిలుపునిచ్చారు. అజో విభో కందాళం–సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థల సంయుక్త నిర్వహణలో 33వ సాహితీ సాంస్కృతిక సదస్సులు, కథానాటిక పోటీలను గురువారం హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రం ఆడిటోరియంలో ఆయన ప్రారంభించి మాట్లాడారు. పోటీ నాటికల పరిచయాన్ని గోపగాని విజయ్ నిర్వహించారు. బీవీకే క్రియేషన్స్, కాకినాడ వారి ‘కన్నీటి విలువెంత’ నాటికను డి.వినయ్ దర్శకత్వంలో ప్రదర్శించారు. నటరాజ డ్రమెటిక్ అసోసియేషన్, పెందుర్తి వారి ‘నీళ్లు నీళ్లు’ నాటికను శేఖర్ భీశెట్టి దర్శకత్వంలో ప్రదర్శించారు. నేరెళ్ల వేణుమాధవ్ స్మృత్యర్థం జీబీఎస్ రాజు మిమిక్రీ ప్రదర్శన ప్రేక్షకులను అలరించింది. కృష్ణ తెలుగు థియేటర్స్, విజయవాడ వారి ‘మరో పుత్తడి బొమ్మ’ నాటిక ప్రదర్శనతో కార్యక్రమం ఆద్యంతం రక్తికట్టింది. డీఎస్‌ఎన్ మూర్తి, ఏవీ నరసింహారావు, వేముల శ్రీనివాస్, వనం లక్ష్మీకాంతారావు, గిరిజ మనోహర్‌బాబు, అప్పాజోష్యుల సత్యనారాయణ, సహృదయ బాధ్యులు, అజో విభో కందాళం కార్యవర్గ సభ్యులు కుందావఝల కృష్ణమూర్తి, ఎం.రాధాకృష్ణ, ఎన్‌వీ ఎన్ చారి, లక్ష్మణరావు, మల్యాల మనోహర్‌రావు, నేలకొండ భాస్కరరావు, ఏవీ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి
కాళోజీ కళాక్షేత్రంలో 33వ సాహితీ సాంస్కృతిక సదస్సు ప్రారంభం
ఓరుగల్లు సంప్రదాయాన్ని కాపాడుకోవాలి


