టీజీ ఎన్పీడీసీఎల్ ఉత్తమ డివిజన్‌గా హనుమకొండ టౌన్
హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో ఉత్తమ డివిజన్‌గా హనుమకొండ టౌన్ ప్రథమ స్థానంలో నిలిచింది. విద్యుత్ వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించేందుకు టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం నూతన సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ముందుకుసాగుతోంది. మరో వైపు వినియోగదారులకు మరింత విస్తృతమైన సేవలు అందించేందుకు అధికారులు, ఉద్యోగులను ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో ప్రతీనెల ఉత్తమ అధికారులను ఎంపిక చేస్తోంది. ప్రతీనెల టీజీ ఎన్పీడీసీఎల్ సెక్షన్ నుంచి సర్కిల్ వరకు బెస్ట్ పర్‌ఫార్మెనెన్స్ కనబరిచిన వాటిని యాజమాన్యం ఎంపిక చేస్తుంది. నవంబర్ మాసంలో ఉత్తమ సర్కిల్, డివిజన్, సబ్ డివిజన్, సెక్షన్‌ల జాబితాను యాజమాన్యం విడుదల చేసింది. ఎన్పీడీసీఎల్ పరిధిలోని మొత్తం 16 సర్కిళ్లలో హనుమకొండ సర్కిల్‌లోని హనుమకొండ టౌన్ డివిజన్ 67.39 పాయింట్లతో ఉత్తమ డివిజన్‌లలో మొదటి స్థానంలో నిలిచింది. ఇదే డివిజన్ పరిధిలో నయీంనగర్ సబ్ డివిజన్ 74.99 పాయింట్లతో మొదటి స్థానంలో, హనుమకొండ సబ్ డివిజన్ 67.88 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. అర్బన్ సెక్షన్‌ల విభాగంలో ఇదే డివిజన్‌లోని నక్కలగుట్ట సెక్షన్ 77.52 పాయింట్లతో ద్వితీయ, గోపాల్‌పూర్ 76.19 పాయింట్లతో తృతీయ, యాదవ నగర్ 75.01 పాయింట్లతో ఐదవ స్థానంలో నిలిచాయి. రూరల్ విభాగంలో మడికొండ సెక్షన్ 63.47 పాయింట్లతో తృతీయ స్థానంలో నిలిచింది. కాగా సర్కిల్ విభాగంలో హనుమకొండ సర్కిల్ 54.31 పాయింట్లతో నాలుగవ స్థానంలో నిలిచింది. ఇందులో పెద్దపల్లి సర్కిల్ 58.12 పాయింట్లతో మొదటి, జగిత్యాల 55.90 పాయింట్లతో ద్వితీయ, కరీంనగర్ 55.84 పాయింట్లతో తృతీయ, మంచిర్యాల 50.65 పాయింట్లతో అయిదవ స్థానంలో నిలిచాయి.
ఉత్తమ సబ్ డివిజన్‌లుగా మొదటి,రెండో స్థానంలో నయీంనగర్, హనుమకొండ
రూరల్ విభాగంలో మూడవ స్థానంలో మడికొండ సెక్షన్
అర్బన్ విభాగంలో రెండు, మూడు స్థానాల్లో నక్కలగుట్ట, గోపాల్‌పూర్


