క్యాథ్‌లాబ్‌లో సాంకేతిక లోపం
ఎంజీఎం: వరంగల్ కాకతీయ వైద్య కళాశాల ప్రాంగణంలో ఉన్న సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి వైద్య సేవలు రోగులకు అందని ద్రాక్షగానే మారుతున్నాయి. గ్యాస్ట్రో, న్యూరో సర్జరీ, న్యూరోఫిజీషియన్ విభాగాలు ఉన్న ఈ ఆస్పత్రిలో కనీసం రోగ నిర్ధారణ పరీక్షలు కూడా చేయడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. సాంకేతిక లోపంతో క్యాథ్‌లాబ్ సేవలు కూడా రెండు రోజులుగా నిలిచిపోయాయి. ఆస్పత్రిలో కార్డియాక్ ఓపీ ఉండే రోజులు కాకుండా.. మిగతా రోజుల్లో అవసరమున్న హృద్రోగులకు క్యాథ్‌లాబ్‌లో అంజియోగ్రామ్, స్టంట్ చికిత్సలు అందించేవారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో రిజిస్ట్రేషన్ చేసుకున్న 30 మందిని గురువారం రాత్రి ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి సహకారంతో నిమ్స్‌కు తరలించారు.
రూ.45 లక్షల మరమ్మతు
నిధుల పెండింగ్..
సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిలోని క్యాథ్‌లాబ్ పరికరాన్ని మరమ్మతులు చేయించేందుకు ఏఏంసీ (సంవత్సర కాలం నిర్వహణ)ని ప్రభుత్వం సంవత్సరానికి రూ.30 లక్షలకు ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు క్యాథ్‌లాబ్ సర్వీస్ చేసే సదరు కంపెనీకి 6 నెలలకోమారు బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. 18 నెలలుగా కంపెనీకి రూ.45 లక్షల బిల్లులు చెల్లించకపోవడంతో ప్రస్తుతం పరికరం ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. పరికరాన్ని మరమ్మతు చేయకపోవడంతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి భవనం ఓపీ సేవలకు మాత్రమే పరిమితమైంది. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి క్యాథ్‌లాబ్ పరికరాన్ని త్వరగా మరమ్మతు చేయాలని రోగులు కోరుతున్నారు.
సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిలో నిలిచిన అంజియోగ్రామ్ పరీక్షలు
ఆరోగ్యశ్రీలో రిజిస్ట్రేషన్ చేసిన
రోగులను నిమ్స్‌కు తరలింపు
18 నెలలుగా ఏఎంసీ నిధులు
చెల్లించని ప్రభుత్వం


