డీజే ప్రోగ్రాంలో పాల్గొని తిరిగొస్తూ.. మృత్యుఒడికి
లింగాలఘణపురం: డీజే ప్రోగ్రాంలో పాల్గొని తిరిగొస్తున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృత్యుఒడికి చేరాడు. కారు.. ఆగి ఉన్న డీసీఎంను ఢీకొన్న ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం జనగామ – సూర్యాపేట జాతీయ రహదారిపై వడిచర్ల వద్ద చోటు చేసుకుంది. ఎస్సై శ్రావణ్‌కుమార్ కథనం ప్రకారం.. ఏపీలోని విజయవాడకు చెందిన సయ్యపురాజు విష్ణువర్ధన్ (32), కారు డ్రైవర్ లవరాజ్, గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన రాంప్రసాద్, హైదరాబాద్‌లోని హబ్సిగూడకు చెందిన శరత్‌కుమార్ డీజే ప్రోగ్రాం నిమిత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లా రామగుండం వెళ్లారు. కార్యక్రమం పూర్తయిన అనంతరం కారులో విజయవాడ బయలుదేరారు. మార్గమధ్యలో వడిచర్ల కల్వర్టు వద్ద ఆగి ఉన్న డీసీఎంను ఎదురుగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో విష్ణువర్ధన్ అక్కడికక్కడే మృతి చెందగా మిగతా ముగ్గురికి గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడు విష్ణువర్ధన్‌కు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. ఈ ఘటనపై బాధిత కుటుంబాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
ఆగి ఉన్న డీసీఎంను ఢీకొన్న కారు.. యువకుడి దుర్మరణం
ముగ్గురికి గాయాలు..
వడిచర్ల వద్ద ఘటన
మృతుడు ఏపీలోని విజయవాడ వాసి


