100 రోజులు.. 41.28 టీఎంసీలు
సాక్షిప్రతినిధి, వరంగల్ : యాసంగి పంటలకు ఈనెల 31 (బుధవారం) నుంచి ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందనుంది. ఈ మేరకు నీటిపారుదలశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి వరంగల్‌లో 9,48,114 ఎకరాల ఆయకట్టుకుగాను ఈ యాసంగిలో 5,29,726 ఎకరాలకు నీరివ్వాలని ఈ నెల 3న జరిగిన రాష్ట్ర స్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ (స్కివం) సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు 41.28 టీఎంసీల నీరు అవసరం ఉండగా.. వారబందీ (వారం రోజులు విడుదల, వారం రోజులు నిలుపుదల) పద్ధతిన స్థిరీకరించిన ఆయకట్టుకు నీటిని విడుదల చేయనున్నారు. వారం రోజులనుంచే హనుమకొండ, జనగామ, ములుగు, నర్సంపేట తదితర డివిజన్‌లలో అధికారులు నీటి విడుదల, నిర్వహణపై సమావేశాలు నిర్వహించారు. కొన్నిచోట్ల ఈ సమావేశాల్లో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు అతిథులుగా పాల్గొని పలు సూచనలు చేశారు.
నేటి ఉదయం 11 గంటలకు..
ఉమ్మడి వరంగల్‌లో నీటి లభ్యత ఉన్న జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల, ఎస్సారెస్పీ కాకతీయ కాలువ (దిగువ మానేరు), ఎస్సారెస్పీ స్టేజ్ – 2 ప్రాజెక్టులతో పాటు పాకాల, రామప్ప చెరువులు, లక్నవరం, మల్లూరువాగు, పాలెంవాగు ప్రాజెక్టుల నుంచి ఈ స్థిరీకరించిన ఆయకట్టుకు సాగునీరు అందించనున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు కరీంనగర్ జిల్లా ఎల్‌ఎండీ నుంచి కాకతీయ కాల్వల ద్వారా ఉమ్మడి వరంగల్‌లోని ఎస్సారెస్పీ ఆయకట్టుకు విడుదల చేయనున్నారు.
‘స్కివం’ షెడ్యూల్ ప్రకారం
నేటి నుంచి నీటి విడుదల
ఈ నెల 3న హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ (స్కివం) మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయాల ప్రకారం యాసంగి ఆయకట్టు సాగునీరు విడుదల చేస్తాం. ఎల్‌ఎండీ నుంచి బుధవారం ఉదయం 11 గంటలకు జోన్–1, జోన్–2లలో స్థిరీకరించిన ఆయకట్టుకు వారబందీ పద్ధతిన నీటి సరఫరా జరుగుతుంది. సాగునీరు వృథా కాకుండా పొదుపుగా వాడుకొని సహకరించాలని రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.
– పి.రమేశ్, ఎస్‌ఈ, ఇరిగేషన్ సర్కిల్–2, కరీంనగర్
నేటినుంచి యాసంగి పంటలకు సాగునీరు
ఎల్‌ఎండీ నుంచి సరఫరాకు
ఇరిగేషన్ శాఖ సన్నద్ధం
వారబందీ పద్ధతి అమలు


