అధ్యాపకుల పదోన్నతులకు ఆమోదం..
● కేయూ పాలకమండలి సమావేశంలో నిర్ణయం
కేయూ క్యాంపస్ : హైదరాబాద్‌లోని సచివాలయంలో మంగళవారం కాకతీయ యూనివర్సిటీ పాలకమండలి సమావేశం నిర్వహించారు. మొత్తం 11 అంశాలపై చర్చించినట్లు సమాచారం. ముఖ్యంగా కొంతకాలం క్రితం కేరీర్ అడ్వాన్స్‌మెంట్ స్కీం కింద (క్యాస్)అసిస్టెంట్ ప్రొఫెసర్లకు అసోసియేట్ ప్రొఫెసర్లుగా, అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్లుగా పదోన్నతులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇందులో ఎక్కువశాతం మంది అధ్యాపకుల పదోన్నతుల ప్రక్రియకు ఆమోదం లభించగా రెండు విభాగాలకు చెందిన నలుగురికి మాత్రం ఆమోదం లభించలేదని సమాచారం. ఫార్మసీ కాలేజీలో ముగ్గురు రిటైర్డ్ ప్రొఫెసర్ల ఎండోమెంట్ లెక్చర్లు ఏర్పాటుకు కూడా చర్చించి ఆమోదించారు. ఓ మాజీ వీసీ, రిజిస్ట్రార్‌పై తమ హయాంలో జరిగిన నియామకాల విషయంలో కొంతకాలం క్రితం విజిలెన్స్ విచారణ జరిగింది. ఆ మాజీ వీసీ, మాజీ రిజిస్ట్రార్‌పై చర్యలు తీసుకునే విషయంపై కూడా పాలకమండలి సమావేశంలో చర్చించినట్లు సమాచారం. వీరిపై చర్యల కోసం గవర్నర్‌కు, ప్రభుత్వానికి ప్రతిపాదించాలని నిర్ణయించినట్లు సమాచారం. సూపరింటెండ్‌ల నుంచి అసిస్టెంట్ రిజిస్ట్రార్‌లుగా నియామకాలకు ఉస్మానియా యూనివర్సిటీలో అనుసరిస్తున్న నిబంధనలకు అనుగుణంగానే కే యూలో కూడా ఏఆర్‌ల నియామకాలు చేపట్టాలని నిర్ణయించారు.దీంతో ఇక సూపరింటెండెట్లకు రాత పరీక్షలోని మెరిట్ అభ్యర్థులకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ద్వారాతోనే నియామకాలు చేపట్టబోతున్నారు. సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ యోగితారాణా, ఉన్నత విద్యాకమిషనర్ శ్రీదేవసేన, కేయూ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి , రిజిస్ట్రార్ వి. రామచంద్రం, పాలకమండలి సభ్యులు పుల్లూరు సుధాకర్, బి. రమ, సుదర్శన్, చిర్రరాజు, సుకుమారి, బాలుచౌహాన్ పాల్గొన్నారు.
విచారణ కమిటీ నియామకం..
తనను వేధిస్తున్నారని కాకతీయ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ విభాగంలోని పార్ట్‌టైం అధ్యాపకుడు డాక్టర్ పి.రమేశ్.. ఆవిభాగంలోని పలువురిపై ఆరోపణలు చేస్తూ జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. విచారణ జరిపేందుకు ఆరుగురు ప్రొఫెసర్లతోకూడిన విచారణ కమిటీని నియమిస్తూ కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం ఈనెల 29న ఉత్తర్వులు జారీ చేశారు. ఈవిచారణ కమిటీ చైర్మన్‌గా కేయూ పాలకమండలి సభ్యుడు ప్రొఫెసర్ బి.సురేశ్‌లాల్ వ్యవహరిస్తున్నారు. ఈవిచారణ కమిటీ పదిరోజుల్లో (వర్కింగ్ డేస్) విచారణ జరిపి నివేదికను తనకు సమర్పించాలని రిజిస్ట్రార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


