సేవతో మార్పు తెస్తున్న రెడ్‌క్రాస్
● హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్
● కలెక్టరేట్‌లో రెడ్‌క్రాస్ సర్వసభ్య సమావేశం
హన్మకొండ అర్బన్: సేవాభావంతో ప్రజల జీవితాల్లో ప్రత్యక్ష మార్పు తీసుకొస్తున్న సంస్థగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పనిచేస్తోందని హనుమకొండ కలెక్టర్, రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షురాలు స్నేహ శబరీష్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ స్నేహ శబరీష్ అధ్యక్షతన రెడ్‌క్రాస్ సొసైటీ హనుమకొండ జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముందుగా రెడ్ క్రాస్ వ్యవస్థాపకులు జీన్ హెన్రీ డ్యూనాంట్, రక్తదాన ఉద్యమ పితామహుడు కార్ల్ ల్యాండ్‌స్టైనర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ విజయచందర్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా 2022–23 నుంచి 2024–25 వరకు అమలైన కార్యక్రమాలు, ఆడిటెడ్ అకౌంట్లు, అలాగే 2025–26 సంవత్సరానికి సంబంధించిన ఆదాయ, వ్యయ అంచనాలను సభ్యులకు వివరించారు. వార్షిక నివేదికలు, బడ్జెట్‌కు సమావేశం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. జిల్లాలో రెడ్ క్రాస్ కార్యక్రమాలకు నిరంతరం సహకరిస్తున్న కలెక్టర్‌కు పాలకవర్గం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ ప్యాట్రన్లను కలెక్టర్, పాలకవర్గ సభ్యులు శాలువాలతో సన్మానించారు. సమావేశంలో రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ పెద్ది వెంకట్ నారాయణగౌడ్, కోశాధికారి బొమ్మినేని పాపిరెడ్డి, రాష్ట్ర పాలకవర్గ సభ్యులు ఈవీ.శ్రీనివాసరావు, జి ల్లా పాలకవర్గ సభ్యులు పుల్లూరు వేణుగోపాల్, డాక్టర్ మాగంటి శేషుమాధవ్, పొట్లపల్లి శ్రీనివాస్ రావు, కె.సుధాకర్‌రెడ్డి, సీహెచ్ సంధ్యారాణి, చెన్నమనేని జయశ్రీ, బిళ్ల రమణారెడ్డి, బాశెట్టి హరిప్రసాద్, రెడ్‌క్రాస్ వైస్ ప్రెసిడెంట్, జిల్లా అదనపు కలెక్టర్ వై.వి గణేశ్, డీటీఓ శ్రీనివాస్‌కుమార్, టీజీఓ నాయకుడు జగన్మోహన్‌రావు, ప్రవీణ్‌కుమార్, టీఎ న్జీఓ నాయకులు రాజేందర్, సోమన్న పాల్గొన్నారు.


