మెనూ ప్రకారం భోజనం అందించాలి
● వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద
మామునూరు: విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. వరంగల్ 43వ డివిజన్ మామునూరులోని జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాలను మంగళవారం రాత్రి కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, వంట గది, స్టోర్ రూమ్, భోజనం నాణ్యతను పరిశీలించి మాట్లాడారు. విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత స్థానాలను అధిరోహించాలని సూచించారు. సీనియర్ జర్నలిస్ట్ శ్రీనాథ్ అందజేసిన 40 దుప్పట్లను కలెక్టర్ విద్యార్థులకు పంపిణీ చేశారు. జిల్లా సంక్షేమాధికారి పుష్పలత, వర్ధన్నపేట మండల స్పెషల్ ఆఫీసర్ రమేశ్, డీసీఓ సరిత, అధికారులు పాల్గొన్నారు.
యాసంగికి సరిపడా యూరియా నిల్వలు
న్యూశాయంపేట: వరంగల్ జిల్లాలో యాసంగి సీజన్‌కు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఒక ప్రకటనలో తెలిపారు.
మౌలిక వసతులపై దృష్టి పెట్టండి..
జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతులపై దృష్టి పెట్టాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. జిల్లా పరిషత్ సమావేశపు హాలులో మంగళవారం మండల స్పెషల్ ఆఫీసర్లతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం, సదుపాయాలను పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుల పెట్టెలు, స్టోర్ రూమ్, కిచెన్‌షెడ్, తరగతి గదులను చెక్‌లిస్ట్ ప్రకారం పరిశీలించి నివేదికలు సమర్పించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, ఇళ్లకు అవసరమైన ఇసుకను జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల ఇసుక రీచ్ నుంచి సరఫరా చేయాలని కోరారు.


