‘వెల్‌నెస్’తో విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసం
● హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్
హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో నిర్వహించే స్టూడెంట్ వెల్ నెస్ కార్యక్రమంతో విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసం మెరుగుపర్చాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో స్టూడెంట్ వెల్‌నెస్ కార్యక్రమ నిర్వహణపై వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతీ పాఠశాల, కళాశాల నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు, అధ్యాపకులకు స్టూడెంట్ వెల్ నెస్ కార్యక్రమంలో భాగంగా.. విద్యార్థుల్లో వ్యక్తిత్వ (మానసిక) వికాసాన్ని పెంపొందించే అంశాలను తెలియజేసేందుకు ఓరిఝెంటేషన్ ప్రోగ్రాంను బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల్లో వికాసాన్ని పెంపొందించేందుకు అధికారులు ప్రశ్నావళిని రూపొందించాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ అప్పయ్య, డీఐఈఓ గోపాల్, విద్యా శాఖ సీఎంఓ సుదర్శన్‌రెడ్డి, డీడబ్ల్యూఓ జయంతి, మైనార్టీ వెల్ఫేర్ అధికారి గౌస్ హైదర్, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి ప్రేమకళ, జిల్లా బాలల పరిరక్షణ అధికారి ప్రవీణ్‌కుమార్, ఎంజేపీఎస్ డీసీఓ ప్రసాద్, వివిధ పాఠశాల, కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు


