వృద్ధ తల్లిదండ్రులను పట్టించుకోకపోతే చర్యలు
న్యూశాయంపేట: వృద్ధ తల్లిదండ్రులను పిల్లలు పట్టించుకోకపోతే సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డాక్టర్ సత్యశారద స్పష్టం చేశారు. వరంగల్ కలెక్టరేట్ సమావేశ హాల్‌లో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం దరఖాస్తులు 151 వచ్చాయి. వాటిలో రెవెన్యూశాఖకు సంబంధించినవి 82, జీడబ్ల్యూఎంసీకి 30, ఇతర శాఖలకు సంబంధించినవి 39 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, ఆర్‌డీఓలు సుమ, ఉమారాణి, డీఎంహెచ్‌ఓ డాక్టర్ సాంబశివరావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి అనురాధ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక రీచ్‌లు
న్యూశాయంపేట: ఇందిరమ్మ ఇళ్లకు అవసరమైన ఇసుకను జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల, టేకుమట్ల ఇసుక రీచ్‌ల నుంచి సరఫరా చేసేందుకు టీజీఎండీసీ కేటాయించిందని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. కలెక్టర్ అధ్యక్షతన సాండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కమిటీ సమావేశం కలెక్టరేట్‌లో సోమవారం జరిగింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన ఇసుక సరఫరా అంశంపై అధికారులతో ఆమె చర్చించారు. సమావేశంలో వరంగల్, నర్సంపేట ఆర్డీవోలు సుమ, ఉమారాణి, ఇన్‌చార్జ్ పీడీ, హౌసింగ్ అధికారి శ్రీవాణి, మైనింగ్ ఏడీ రవికుమార్, తహసీల్దార్లు విజయ్‌సాగర్, శ్రీనివాస్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.
యూరియాపై కలెక్టర్ సమీక్ష
ఖిలా వరంగల్: కలెక్టరేట్ కార్యాలయంలో వ్యవసాయ అధికారులతో కలిసి యూరియాపై కలెక్టర్ డాక్టర్ సత్యశారద సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో డీలర్ల షాపుల్లో 434 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని పేర్కొన్నారు. అలాగే, రాష్ట్రంలో ప్రస్తుతం 1,65,000 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులకు అవసరమైన యూరియా సరఫరా చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఏఓ అనురాధ, వ్యవసాయ అధికారులు విజ్ఞాన్, రవీందర్, ఏఈఓ చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజావాణిలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద
వృద్ధ తల్లిదండ్రులను పట్టించుకోకపోతే చర్యలు


