ఎమ్మెల్యే నాయిని ఇంటి ముట్టడికి యత్నం
హన్మకొండ: బీఆర్‌ఎస్ ఎస్సీ సెల్, దళిత సంఘాలు చేపట్టిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఇంటి ముట్టడిని పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్.ప్రవీణ్‌కుమార్, మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్యపై అనుచిత వ్యాఖ్యలు, వ్యక్తిగత విమర్శలు చేసిన నాయిని రాజేందర్‌రెడ్డి సోమవారంలోగా బహిరంగ క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్ ఎస్సీ సెల్ నాయకులు డిమాండ్ చేశారు. నాయిని రాజేందర్‌రెడ్డి క్షమాపణలు చెప్పకపోవడంతో సోమవారం హనుమకొండ బాలసముద్రంలోని నాయిని రాజేందర్‌రెడ్డి నివాసముంటున్న క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించారు. హనుమకొండ కాళోజీ విగ్రహం వద్ద ధర్నా చేసిన బీఆర్‌ఎస్ ఎస్సీ సెల్, దళిత సంఘాల నాయకులు డప్పు చప్పుళ్లతో ర్యాలీగా బయల్దేరి వెళ్లారు. ర్యాలీని అడ్డుకున్న పోలీసులు బీఆర్‌ఎస్ నాయకులను వెంటనే అరెస్ట్ చేసి పోలీసు వాహనం ఎక్కించారు. మరికొందరు ఆందోళనకారులు కాళోజీ కూడలిలో నాయిని రాజేందర్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనలో మాజీ కార్పొరేటర్ జోరిక రమేశ్, దళిత కార్పొరేటర్లు సంకు నర్సింగ రావు, ఇమ్మడి లోహిత రాజు, సోదా కిరణ్, మాజీ కార్పొరేటర్ మేకల బాబు రావు, నాయకులు కంజర్ల మనోజ్, పున్నం చందర్, కొండ్ర శంకర్, సదాంత్, కోటి, హరినాథ్ పాల్గొన్నారు.
అడ్డుకున్న పోలీసులు..
పోలీస్‌స్టేషన్‌కు తరలింపు
క్షమాపణ చెప్పాలని నేతల డిమాండ్


