‘కుడా’.. విస్తరణ ఎక్కడ?
సాక్షి, వరంగల్:
వరంగల్ నగరం చుట్టుపక్కల 50 కిలోమీటర్ల మేర ఉన్న శివారు ప్రాంతాలు ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి దిశగా కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) పరిధిని విస్తరించాలని నిర్ణయించినా ఇంకా పట్టాలెక్కేలా చూడడం లేదు. ‘కుడా’ పరిధి విస్తరణ ద్వారా వందలాది గ్రామాలు, పదుల సంఖ్యలో మండలాల్లో రోడ్లు, మురుగు నీటి పారుదల వ్యవస్థ, పార్కులు, కరెంట్.. తదితర మౌలిక వసతులు ప్రణా ళికాబద్ధమైన అభివృద్ధికి అస్కారం ఉంటుంది.
పరిధి పెంచితే ప్రభుత్వానికి..
ప్రజలకు మంచిదే
‘కుడా’ పరిధిని పెంచడం ద్వారా ప్రధాన మండలకేంద్రాలు కలుపుకుని మొత్తం 82 గ్రామాలు అర్బన్ డెవలప్‌మెంట్ ఆథారిటీలోకి వస్తాయి. ఫలితంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం (పీఎంఏవై) ద్వారా కేంద్రం అందించే సాయం రెట్టింపయ్యే అవకాశముంటుంది. పేదల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి గ్రామీణ ప్రాంత యూనిట్ కాస్ట్ రూ.72 వేలు ఉండగా, పట్టణ ప్రాంత యూనిట్ కాస్ట్ 1.5 లక్షలుగా కొనసాగుతోంది. కుడా విస్తరణ ద్వారా వందల సంఖ్య గ్రామ పంచాయతీలు పట్టణ పరిధిలోకి చేరుతాయి. దీంతో వీటిని పట్టణ ప్రాంత యూనిట్ కాస్ట్ ప్రకారం నిధులు అందే అవకాశం ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఇందిరమ్మ ఇళ్ల నిధుల విషయంలో రూ.కోట్లలో అదనపు భారం తగ్గే అవకాశం ఉంది. పట్టణ ప్రాంతాల్లో అమలుచేసే వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందే అవకాశం ఉంటుంది. అనధికారిక లేఔట్‌లను నియంత్రించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మెరుగుపడే అవకాశముంటుంది. బృహత్ ప్రణాళిక అమలులో ఉండి ఈ ప్రాంతాలన్నీ పట్టణాలకు దీటుగా అభివృద్ధి చెందుతాయి. వరదలొచ్చినా పెద్దగా ఇబ్బంది ఉండదు.
ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి ‘కుడా’ విస్తరణ ప్రతిపాదనలు
ఏడాది దాటినా ప్రభుత్వం వద్దనే ఫైల్
అనుకున్నదే తడవుగా హెచ్‌ఎండీఏ పరిధి విస్తరణకు జీఓ
ఇక్కడ కూడా నేతలు కలిసి
పరిధిని పెంచాలంటున్న జనం
ఇది జరిగితే ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ప్రభుత్వంపై తగ్గనున్న భారం
అనధికారిక లేఔట్‌లు తగ్గి
అభివృద్ధికి అవకాశం
‘7,257 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉన్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) పరిధిని 2025 మార్చి 12న 10,472.723 చదరపు కిలోమీటర్లకు పరిధికి పెంచుతూ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. ముఖ్యంగా జాతీయ, రాష్ట్ర రహదారులను కలుపుతూ వస్తున్న 354 కిలోమీటర్ల పొడవైన రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్)కు వెలుపల రెండు కిలోమీటర్లు బఫర్ జోన్‌గా నిర్ధారిస్తూ, అక్కడి ప్రాంతాలను కలుపుతూ హెచ్‌ఎండీఏ విస్తీర్ణాన్ని పెంచింది. ఇలా అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రతిపాదనలు రూపొందించిన నెలల వ్యవధిలోనే చకచకా అమలు చేసింది’
‘రాష్ట్ర రెండో రాజధానిగా పేరొందిన వరంగల్ నగరం కూడా అభివృద్ధి బాట పడుతోంది. ఔటర్ రింగ్ రోడ్డు, మామునూరు విమానాశ్రయం, కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు ప్రాజెక్టులు పట్టాలెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో 1,805 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉన్న కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) పరిధిని 2738.19 (మరో 933.19) చదరపు కిలోమీటర్లకు పెంచాలంటూ గతేడాది అక్టోబర్‌లో ప్రతిపాదనలు రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. ఆ తర్వాత దీన్ని ముఖ్య రాజకీయ నేతలు పట్టించుకోకపోవడంతో ఏడాది దాటినా ఎక్కడికక్కడే ఉంది.


