వినడమేనా.. పరిష్కారం లేదా?
వరంగల్ అర్బన్ : ‘సమస్యలు పరిష్కరిస్తామని గొప్పలు చెప్పడమే తప్ప.. విన్నవించిన ఫిర్యాదులపై స్పందించకపోతే ఎలా? అంటూ పలు కాలనీల ప్రజలు గ్రేటర్ వరంగల్ గ్రీవెన్స్ సెల్‌లో అధికారులను నిలదీశారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌కు 89 ఫిర్యాదులు అందాయి. ఆయా విభాగాల వింగ్ అధికారులు వినతులు స్వీకరించారు. చేస్తాం, చూస్తాం.. అని కాలయాపన చేస్తున్నారు తప్ప, ఏ ఒక్క పని కూడా జరగడం లేదన్నారు. దీంతో ఆయా విభాగాల అధికారులు సంబంధిత విభాగం సిబ్బందిని పిలిచి పరిష్కారంపై నిర్లక్ష్యం వీడి, నిర్ణీత గడువులోగా ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించాలని సూచనలు చేశారు. మొత్తం 89 ఫిర్యాదులు రాగా, అందులో టౌన్ ప్లానింగ్ 44, ఇంజనీరింగ్ 23, రెవెన్యూ సెక్షన్‌కు 8, హెల్త్– శానిటేషన్‌కు 8, నీటి సరఫరా 4, ఉద్యానవన విభాగానికి 2 ఫిర్యాదు అందినట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో సీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి, సీహెచ్‌ఓ రమేశ్, డీఎఫ్‌ఓ శంకర్ లింగం, ఇన్‌చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్న రాణి, సమ్మయ్య, హెచ్‌ఓ లక్ష్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు
అందినవాటిలో కొన్ని ఫిర్యాదులు..
● దేశాయిపేట రోడ్డులోని చికెన్ సెంటర్ నిర్వాహకులు వ్యర్థాలను కాల్వల్లో వేస్తున్నారని, చర్యలు తీసుకోవాలని స్థానికులు ఫిర్యాదు చేశారు.
● వరంగల్ 12వ డివిజన్ డాక్టర్స్ కాలనీ–2, స్నేహనగర్‌లో పందుల సంచారంతో ఇబ్బందులు పడుతున్నామని అభివృద్ధి కమిటీ ప్రతినిధులు విన్నవించారు.
● 36వ డివిజన్ చింతల్ ఆర్‌ఓబీ ప్రాంతంలో గార్డెనింగ్, వీధిలైట్లు ఏర్పాటు చేయాలని సమీప ప్రాంతాల ప్రజలు కోరారు.
● హనుమకొండ గోపాలపురం గ్రామ పంచాయతీ ఆఫీస్ ప్రాంతంలో డ్రెయినేజీ నిర్మించాలని కాలనీ కమిటీ ప్రతినిధులు విన్నవించారు.
● 1వ డివిజన్ 52–3–154 ఇంటినంబర్ ప్రాంతంలో వీధిలైట్లు వెలగడం లేదని స్థానికులు ఫిర్యాదు చేశారు.
● 56వ డివిజన్ పరిమళ కాలనీలో రోడ్డు–15లో సీసీ రోడ్డుకు 20శాతం కాంట్రిబ్యూషన్ సొమ్ము చెల్లించామని, ఇంతవరకు నిర్మించడం లేదని అభివృద్ధి కాలనీ కమిటీ ప్రతినిధులు వాపోయారు.
● వీలిన గ్రామం ఎర్రగట్టు గుట్ట కిట్స్ కాలేజీ సమీపంలో నల్లా లేకున్నా బిల్లు వస్తుందని నితీష్ రెడ్డి ఫిర్యాదు చేశారు.
● ఎర్రగట్టు గుట్ట ప్రాంతంలో కుక్కల బాధ, వీధిలైట్లు తదితర సమస్యలను పరిష్కరించాలని స్థానికులు కోరారు.
● 66వ డివిజన్ ముచ్చర్ల గ్రామం ప్రాథమిక పాఠశాలలో మట్టి రోడ్డుతో ఇబ్బందులు పడుతున్నామని, సీసీ వేయాలని పాఠశాల అభివృద్ధి కమిటీ ప్రతినిధులు విన్నవించారు.
● కోమటిపల్లిలో తాగునీరు. రోడ్ల సమస్యలు పరిష్కరించాలని స్థానికులు ఫిర్యాదు చేశారు.
● హనుమకొండ బొక్కలగడ్డలో బల్దియా డ్రెయినేజీ మూసివేశారని, చర్యలు తీసుకోవాలని స్థానికులు ఫిర్యాదు చేశారు.
గ్రేటర్ వరంగల్ గ్రీవెన్స్‌లో
ఫిర్యాదుదారుల ఆవేదన
బల్దియాకు 89 వినతులు


