మహిళా సంఘాలకు వీఎల్‌ఆర్ నిధులు
మంత్రి సీతక్క
హన్మకొండ అర్బన్: జిల్లాలోని 12 మండలాల పరిధి స్వయం సహాయక సంఘాల సభ్యులైన 9,046 మందికి వడ్డీ లేని రుణంగా రూ. 6.51 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందని, ఈ నిధులు మంగళవారం స్థానిక ఎమ్మెల్యేల భాగస్వామ్యంతో పంపిణీ చేయాలని మంత్రి సీతక్క అన్నారు. సోమవారం కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో హైదరాబాద్ నుంచి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఏటూరునాగారం నుంచి గ్రామీణాభివృద్ధి, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పాల్గొని వివరాలు వెల్లడించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాల్లో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సాగేందుకు ముందస్తు ప్రణాళికలు చేయాలని సూచించారు. అర్హులైన ప్రతీ మహిళకు చీర అందేలా చూడాలన్నారు. సమావేశంలో జిల్లా నుంచి కలెక్టర్ స్నేహ శబరీష్, డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ మేన శ్రీనివాస్, సెర్ప్ అధికారులు పాల్గొన్నారు.
రుణాల పంపిణీకి ఏర్పాట్లు చేయాలి :
వరంగల్ కలెక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: వరంగల్ జిల్లానుంచి వీసీలో కలెక్టర్ సత్యశారద, జెడ్పీ సీఈఓ, ఇన్‌చార్జ్ డీఆర్‌డీఓ రామిరెడ్డి, జిల్లా మహిళా సమాఖ్య ప్రతినిధులు ఉమ, రాధిక, ఐకేపీ అధికారులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ సమబావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో నేడు (మంగళవారం) జిల్లాలో 10,357 ఎస్‌హెచ్‌జీ సంఘాలకు రూ.6.52 కోట్ల వడ్డీ లేని రుణాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని అన్ని సెగ్మెంట్లలో ఏకకాలంలో పండుగ వాతావరణంలో జరిగేలా విస్తృత ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.


