
మెరుగైన వైద్య సేవలందించాలి
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్
హన్మకొండ: పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ సూచించారు. హనుమకొండ ఎన్జీవోస్ కాలనీలోని వడ్డేపల్లి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపీ, గర్భిణులు, బాలింతల నమోదు, ఔషధాల నమోదు రిజిస్టర్లను పరిశీలించారు. రికార్డుల్లో సమగ్ర వివరాలు నమోదు చేయకపోవడంతో సిబ్బందిని మందలించారు. పలు విభాగాల వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ల్యాబ్ టెక్నీషియన్ అందుబాటులో లేకపోవడంపై కలెక్టర్ ఆరా తీయగా తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్‌కు డిప్యుటేషన్‌పై పంపించినట్లు డీఎంహెచ్‌ఓ అప్పయ్య తెలిపారు. రోగులకు వైద్య పరీక్షలు ఎలా చేస్తున్నారని కలెక్టర్ ప్రశ్నించగా వారంలో రెండు రోజులపాటు (సోమ, శుక్రవారం) స్టాఫ్‌నర్స్ ద్వారా రక్త నమూనాలు సేకరించి తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్‌కు పంపిస్తున్నట్లు ఆయన వివరణ ఇచ్చారు. అదేవిధంగా వడ్డేపల్లిలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శాశ్వత భవన నిర్మాణ పనులు కలెక్టర్ పరిశీలించి త్వరగా పూర్తిచేయాలని సూచించారు. కలెక్టర్ వెంట హనుమకొండ తహసీల్దార్ రవీందర్‌రెడ్డి, వడ్డేపల్లి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి మాలిక, సిబ్బంది ఉన్నారు.