
నాలుగేళ్లుగా గ్రహణం
సాక్షి, వరంగల్: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో సంతాన సాఫల్య కేంద్రం (ఐవీఎఫ్) ఏర్పాటుకు నాలుగేళ్లుగా గ్రహణం పట్టుకుంది. 2021లో ఎంజీఎంలోని మాతా శిశుభవనం రెండో అంతస్తులో సంతాన సాఫల్య కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించి మంజూరునిచ్చినా ఆ పనులే అటకెక్కాయి. అప్పటికే ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్‌కు పనులు కేటాయించింది. వాటర్ లీకేజీతో అక్కడ సురక్షితం కాదన్న తెలంగాణ ప్రభుత్వ వైద్యసేవలు, మౌలిక సదుపాయాల సంస్థ కొత్తగా నిర్మిస్తున్న 24 అంతస్తుల్లోని మల్టీసూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఏర్పాటు చేద్దామని భావించింది. ఎల్‌అండ్‌టీ సంస్థ టెండర్ నిబంధనల ప్రకారమే తాము ముందుకెళ్తామని, ఈ ఐవీఎఫ్ సెంటర్‌కు సంబంధించి కూలింగ్ ల్యాబ్, ఇతర పరికరాలు అక్కడ ఏర్పాటు చేయలేమని స్పష్టం చేసింది. కేఎంసీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలోనే ఈ ఐవీఎఫ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఇటీవల నిర్ణయించినా ఇంకా ఆచరణలోకి రాలేదు. దీని సాధ్యాసాధ్యాలపై త్వరలోనే నిర్ణయం ఉంటుందని ఎంజీఎం అధికారులు చెబుతున్నారు. ఓవైపు పిల్లలు కావాలనుకునే దంపతుల ఆశను క్యాష్ చేసుకొని ప్రైవేట్ ఐవీఎఫ్ కేంద్రాలు రూ.లక్షల్లో గుంజుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేద్దామనుకున్న సంతాన సాఫల్య కేంద్రం ఏళ్లుగా పెండింగ్‌లో ఉండడం వాళ్లకు కలిసొస్తుందనే విమర్శలొస్తున్నాయి. సీకేఎం ప్రసూతి ఆస్పత్రిలో ఈ ఏడాది మార్చి 15న ఏర్పాటుచేసిన ఫెర్టిలిటీ క్లినిక్ మెడికేషన్‌కు మాత్రమే పరిమితమైంది. పిల్లలు లేని దంపతులు ఆర్థికంగా నష్టపోకుండా ఉండేందుకు సాధ్యమైనంత తొందరగా ఐవీఎఫ్ కేంద్రాన్ని ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు.
ఎంజీఎంలో సంతాన సాఫల్య కేంద్రం టెండర్లకే పరిమితం
సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలోనూ
ఏర్పాటుకు అడ్డంకులే
ప్రైవేట్ సెంటర్లలో రూ.లక్షలు చెల్లిస్తున్న పిల్లలు లేని దంపతులు
త్వరగా అందుబాటులోకి తేవాలని కోరుతున్న నగరవాసులు
ఐవీఎఫ్‌తో ఫలితం లేకుంటే ఐయూఐ..
మందులతో సంతానం కలుగకపోతే వైద్యులు దంపతులకు ఇంట్రా యుటెరిన్ ఇన్సామినేషన్ (ఐయూఐ) పద్ధతి సూచిస్తారు. దీని ద్వారా గర్భాశయంలో ప్రత్యక్షంగా వీర్యాన్ని విడుదల చేస్తారు. చాలా వరకు ఐయూఐతోనే పరిష్కారం దొరుకుతుంది. కొందరికి ఇందులో కూడా ఫలితం కనిపించకపోతే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) పద్ధతి సూచిస్తారు. ఈ పద్ధతిలో శరీరంలో అండోత్పత్తిని మందులతో పెంచి, అండాన్ని సేకరిస్తారు. శుక్రకణాలతో అండాన్ని ల్యాబ్‌లో ఫలదీకరిస్తారు. మిగతా పరీక్షలు పూర్తిచేసినంతరం మహిళ గర్భంలోకి పంపిస్తారు. ప్రైవేట్ సంతాన సాఫల్య కేంద్రాల్లో ఐవీఎఫ్ చేయించుకోవాలంటే సుమారు రూ.లక్షల్లో వసూలు చేస్తుండడం పేద, మధ్య తరగతి కుటుంబాలకు భారం కానుంది. ‘ఉమ్మడి వరంగల్ జిల్లాలో పిల్లలు లేని దంపతులకు ఐవీఎఫ్ కేంద్రం ఓ భరోసాగా నిలువనుంది. ఇటీవల హైదరాబాద్‌లో సృష్టి నిర్వాహకులు చేసిన అక్రమ దందా ప్రకంపనలు సృషించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసే ఐవీఎఫ్‌తో పిల్లలు లేని దంపతులకు ఆర్థిక ఇబ్బందులు తప్పుతాయి’ అని ప్రభుత్వ వైద్యులు పేర్కొంటున్నారు.