
అలరించిన ఓరుగల్లు జానపద జాతర
హన్మకొండ కల్చరల్: ప్రపంచ జానపద దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ, అంజలి మీడియా గ్రూప్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఓరుగల్లు జానపద జాతర–25 అలరించింది. హనుమకొండ పబ్లిక్ గార్డెన్‌లోని నేరేళ్ల వేణుమాధవ్ కళాప్రాంగణంలో జానపద కళాకారులు స్వర్గీయ దీకొండ సారంగపాణి, కూనమల్ల శంకర్ స్మారకంగా గ్రూప్ చైర్మన్ కామిశెట్టి రాజు పటేల్ అధ్యక్షతన జానపద జాతర నిర్వహించారు. ఈసందర్భంగా కళాకారులు గోల్కొండ బుచ్చన్న, తాళ్ల సునీత్, జూపాక శివ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా, వివిధ జిల్లాల నుండి జానపద గాయనీగాయకులు పాల్గొని శంకర్, సారంగపాణి పాటలను ఆటపాటలతో అలరించారు. కాకతీయ బుక్ ఆఫ్ నేషనల్ రికార్డ్ సర్టిఫికెట్‌ను సారంగపాణి కుటుంబసభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో రచయిత వల్లంపట్ల నాగేశ్వరరావు, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ పసునూరి రవీందర్, సినీగేయ రచయిత, గాయకుడు వరంగల్ శ్రీనివాస్, జానపద ఉద్యమ కవి గిద్దె రాంనర్సయ్య, సంగీత దర్శకులు సీతాల రఘువేందర్, వెన్నెల శ్రీనాఽథ్, ఆకుల సదానందం, గూడూరు బాలాజీ తదితరులు పాల్గొన్నారు.