
ఒక్కో క్వారీనుంచి లారీ
సాక్షిప్రతినిధి, వరంగల్: ఇసుక దందా ఉమ్మడి వరంగల్‌లోని కొన్ని ఠాణాల పోలీసులకు కాసుల వర్షం కురిపిస్తోంది. పోస్టింగ్ కోసం ప్రయత్నం చేసేటప్పుడే చాలామంది ఎస్‌ఐలు, సీఐలు ఇసుక అక్రమ దందా సాగే ప్రాంతాలను ఎంచుకోవడమన్నది పరిపాటిగా మారింది. ఏ పోలీసు స్టేషన్ పరిధిలో ఎక్కువ వాగులు, ఇసుక, మొరం.. బెల్టుషాపుల దందా సాగుతుందో.. ఆ ఠాణాలే లక్ష్యం చేసుకుని చాలామంది పోస్టింగ్‌లు కొడుతున్నారు. ఆ తర్వాత నెలవారీ మామూళ్లు షరా మామూలుగా మారి... ఇసుక వ్యాపారులు తమ దందాను సాగించుకోవడం సర్వసాధారణం. కానీ కొందరు మామూళ్లతోపాటు టెండర్‌ల ద్వారా పొందిన క్వారీల నుంచి పుక్కిడికి లారీల్లో ఇసుక నింపి హైదరాబాద్‌కు పంపుతూ దందా నిర్వహిస్తున్నారు. అదనపు ఆదాయానికి రుచి మరిగిన ఇలాంటి వారు తమకు అనుకూలురైన నాయకులు, అధికారుల పేర్లు వాడుతూ వివాదాస్పదులు అవుతున్నారు. ఇదే తరహాలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంత ఏజెన్సీ ఏరియా ఠాణాలో పనిచేసే సబ్ ఇన్స్‌పెక్టర్ (ఎస్‌ఐ) ఒకరు నెలవారీవి ‘మామూలు’గా తీసుకుంటూ ఇసుక దందాను నిర్వహిస్తుండటం ఇప్పుడు పోలీసుశాఖలోనే చర్చనీయాంశంగా మారింది.
ఎస్‌ఐపై ఫిర్యాదులు..
మామూళ్లు ఇచ్చి దందా చేసుకోవడానికి అలవాటు పడిన ఇసుక వ్యాపారులు.. అదనంగా ఇసుక లారీలను నింపి పంపాలని ఇబ్బందులు పెడుతున్న సదరు ఏజెన్సీ ఠాణా ఎస్‌ఐపై ఇటీవల డీజీపీ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. ఆ జిల్లా పోలీసు ఉన్నతాధికారికి కూడా ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన సదరు వ్యాపారులు.. ఆ ఉన్నతాధికారి సెలవులో ఉన్నట్లు తెలుసుకుని డీజీపీ, అడిషనల్ డీజీపీలకు పంపినట్లు చెబుతున్నారు. సదరు ఎస్‌ఐపై ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచిల ద్వారా విచారణ జరిపించి నిజమని తేలితేనే చర్యలు తీసుకోవాలని ఆధారాలతో సహా ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిసింది. కాగా ఇసుక దందాపై ఓ సబ్ ఇన్‌స్పెక్టర్‌పై డీజీపీ స్థాయి అధికారికి ఆ ఏజెన్సీ జిల్లా నుంచి ఫిర్యాదు చేయడం ఇదే మొదటిసారి కావడంతో పోలీసుశాఖలో కలకలంగా మారింది.
అధికారికంగా 10 వరకు ఇసుక క్వారీలు ..
గోదావరి పరీవాహక ప్రాంతంలో 10 వరకు ఇసుక క్వారీలు అధికారికంగా నడుస్తున్నాయి. వర్షాకాలం నేపథ్యంలో ముందే అప్రమత్తమైన కాంట్రాక్టర్‌లు వేల క్యూబిక్ మీటర్లను ఇసుకను గోదావరి ఒడ్డున నిల్వచేసి ఆన్‌లైన్ ఆర్డర్‌లపై సరఫరా చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని ఓ ఠాణాలో పనిచేసే ఎస్‌ఐ.. ఆ ఠాణా పరిధితోపాటు చుట్టుపక్కల క్వారీల నిర్వాహకులనుంచి ఇసుకను ఉచితంగా నింపిస్తూ హైదరాబాద్‌కు తరలిస్తున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి. ఒక్కో క్వారీనుంచి నెలలో రెండు నుంచి మూడు.. నెలలో మొత్తం 15 నుంచి 20 లారీల ఇసుకను సరఫరా చేస్తున్నారు. ఒక్కో లారీ యజమాని, డ్రైవర్‌లకు కిరాయి, డీజిల్ ఖర్చులు పోను రూ.5 వేలు మిగిలేలా చేస్తూ.. నెల మొత్తంలో సదరు ఎస్‌ఐ కనీసం రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు సంపాదిస్తున్నట్లు చెబుతున్నారు. ఎవరన్న క్వారీ, లారీ యజమానులు సహకరించకపోతే మైనింగ్, టీజీఎండీసీ, రవాణాశాఖ అధికారులతో బెదింరిపులకు పాల్పడుతున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి.
నెలలో కనీసం 15 ట్రిప్పులు... రూ.3 లక్షలకుపైనే సంపాదన
ఏజెన్సీ ప్రాంతంలో ఓ ఎస్‌ఐకి
ఇది ఇసుకతో పెట్టిన విద్య
ఇసుక క్వారీలనుంచి
మామూళ్లతోపాటు ఇది అదనం
డీజీపీ కార్యాలయానికి
బాధితుల ఫిర్యాదులు