
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
ఎంజీఎం/హసన్‌పర్తి: సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా వైద్యులు అప్రమత్తంగా ఉంటూ క్షేత్రస్థాయిలో మెడికల్ క్యాంపులు నిర్వహించాలని రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ ప్రాజెక్టు డైరెక్టర్ వాసం వెంకటేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఎంజీఎం ఆస్పత్రితోపాటు చింతల్ యూపీహెచ్‌సీ, హసన్‌పర్తి మండలం సిద్ధాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, వంగపహాడ్‌ను డీఎంహెచ్‌ఓ డాక్టర్ సాంబశివరావుతో కలిసి సందర్శించారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ కిశోర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలోని ఫీవర్ వార్డు, ఐసీటీసీ కేంద్రం, రక్తనిధి కేంద్రం, ఫార్మసీ విభాగాలను తనిఖీ చేశారు. అనంతరం పట్టణ ఆరోగ్య కేంద్రం చింతల్‌లో పర్యటించి అందిస్తున్న సేవల గురించి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించి డెంగీ బాధితురా లైన నజియా కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జ్వర పీడిత ప్రాంతాల్లో మెడికల్ క్యాంప్‌లు నిర్వహించాలన్నా రు. స్కూళ్లలో, సంక్షేమ హాస్టల్స్‌లో విద్యార్థులకు ఫీవర్ సర్వే చేసి అవసరమైన వారికి టెస్టులు చేయాలన్నారు. క్రమంతప్పకుండా శానిటేషన్ చేయాలని, డ్రై డే పాటించాలని అదేశించారు. వైద్యులు అందుబాటులో ఉండాలని, మందుల నిల్వలు సరిపడా పెట్టుకోవాలన్నారు. వంగపహాడ్‌లో డెంగీ పీడిత ప్రాంతాలను సందర్శించారు. డెంగీ బాధితురాలి తో మాట్లాడి పరిస్థితిని అడిగితెలుసుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో డిప్యూటీ డైరెక్టర్ నాగార్జున, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ గౌతమ్ చౌహన్, అడిషనల్ డీఎంహెచ్‌ఓ డాక్టర్ మదన్మోహన్‌రావు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ అశ్విన్, డాక్టర్ శ్రీపాల్, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్
పీడీ వెంకటేశ్వర్‌రెడ్డి