
నాలాలు కబ్జా చేస్తే కఠిన చర్యలు
న్యూశాయంపేట: నాలాలు కబ్జా చేసి నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకోవాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అధికారులను ఆదేశించారు. బుధవారం నగర పరిధిలోని 14వ డివిజన్ ఎస్‌ఆర్‌నగర్ 100 ఫీట్ల రోడ్, బాలాజీ నగర్‌లలో కచ్చా నాలా తీస్తున్న ప్రాంతాల్లో మేయర్ గుండు సుధారాణి, వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్‌లతో కలిసి ఆయన పర్యటించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. సుమారు 30 కోట్ల రూపాయలతో ప్రణాళిక రూపొందించి సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి నిధులు తెస్తామని, శాశ్వత ముంపునివారణ నిర్మాణాలు చేపడుతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓ సత్యపాల్‌రెడ్డి, స్థానిక కార్పొరేటర్ తుర్పాటి సులోచనా, సారయ్య, డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ ఇంతేయాజ్ పాల్గొన్నారు.
ముంపు నివారణకు ప్రత్యేక చర్యలు
రామన్నపేట: నగరంలో ముంపు నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు మేయర్ గుండు సుధారాణి తెలిపారు. బుధవారం వరంగల్ నగర పరిధి చింతల్ మైసమ్మ గుడి వద్ద డ్రెయిన్ నిర్మాణ పనుల్ని కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. ముంపుప్రాంత వాసుల కోసం ముందస్తుగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వారికి మంచి నీరు, ఆహారం అందజేస్తున్నట్లు తెలిపారు. భద్రకాళి బండ్ ప్రాంతంలో అభివృద్ధి పనులు పూర్తయితే ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందన్నారు. కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ.. ఈనెల 16 వరకు భారీ వర్ష సూచనలు ఉన్నందున బల్దియా అధికారులు, సిబ్బంది అందురూ అప్రమత్తంగా ఉన్నట్లు తెలిపారు. టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశామని జవాన్‌లతో పాటు ప్రత్యేకంగా మాన్‌సూన్ బృందాలు ఫీల్డ్‌లో పని చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ ఎస్‌ఈ మహేందర్, ఎంహెచ్‌ఓ రాజేశ్, ఇన్‌చార్జ్ ఈఈ సంతోశ్ బాబు, డీఈలు రవి కిరణ్, మొజామిల్, తదితరులు పాల్గొన్నారు.
ఉర్సు ఏర్పాట్లపై సమీక్ష
హన్మకొండ అర్బన్: ఈనెల 17 నుంచి 22 వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కాజీపేట దర్గా ఉర్సు ఉత్సవాలకు జీడబ్ల్యూఎంసీ అధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నట్లు మేయర్ గుండు సుధారాణి తెలిపారు. బుధవారం హనుమకొండ కలెక్టరేట్‌లో దర్గా ఉత్సవాల ఏర్పాట్లు, నిర్వహణ, బందోబస్తు, తీసుకోవాల్సిన ఇతర జాగ్రత్తలపై బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డిలతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉర్సు నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతామన్నారు. సమావేశంలో డీఆర్‌ఓ వై.వి గణేశ్, ఆర్డీఓ రాథోడ్ రమేశ్, కాజీపేట ఏసీపీ ప్రశాంత్‌రెడ్డి, జిల్లా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ గౌస్ హైదర్, దర్గా పీఠాధిపతి ఖుస్రూపాషా, డిప్యూటీ కమిషనర్ రవీందర్, అధికారులు పాల్గొన్నారు.
వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు