
ఇంకా తేరుకోలేదు..!
రెండు రోజులైనా నగరంలోని పలు కాలనీలను వీడని వరద
సాక్షి, వరంగల్: వరంగల్ నగరంలో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు వరుణుడు సృష్టించిన వరద బీభత్సం ఇంకా చాలా కాలనీలను వీడలేదు. మంగళవారం రాత్రి వరంగల్‌లో 19 మిల్లీమీటర్లు, ఖిలా వరంగల్‌లో 19.3 మిల్లీమీటర్ల మోస్తరు వర్షం కురిసింది. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు తెరిపివ్వడంతో నగరంలోని ప్రధాన రహదారుల్లోని నిలిచిన నీరు క్లియర్ అయినా, మైసయ్యనగర్, వివేకానంద కాలనీ, మధురానగర్, పద్మానగర్, శివనగర్, సాకరాశికుంట, నాగేంద్రనగర్, ఎస్‌ఆర్ తోట, సంతోషి మాత కాలనీలను ఇంకా వరద వీడలేదు. ముఖ్యంగా వర్షపు నీరు బయటకు వెళ్లే స్ట్రోమ్ వాటర్ డ్రెయిన్‌లు ఇరుకుగా ఉండడం వల్ల నీటి ప్రవాహంలో ఇబ్బందులు ఏర్పడి రోడ్లపైనే నిలిచిపోతోంది. డ్రెయినేజీలు, రహదారుల నిర్మాణాలు అసంపూర్తిగా వదిలేయడం వల్లే ఈ కాలనీలకు ప్రతీ వర్షాకాలం తిప్పలు తప్పడంలేదనే విమర్శలొస్తున్నాయి. ఖిలా వరంగల్ అగర్త చెరువు వరదనీటి కాల్వల నిర్మాణం, అభివృద్ధి పనుల పేరుతో ఉర్సు చెరువుకెళ్లే కచ్చా నాలాను మూసివేయడం, అండర్ డ్రెయినేజీ, స్ట్రోర్మ్ వాటర్ డ్రెయినేజీ నిర్మాణం, చేపల బ్రిడ్జి విస్తరణ, పెరికవాడ వరదనీటి కాలువ పనులతోపాటు నాలా విస్తరణ ఆలస్యం వల్లే ఇళ్లలోకి వరద చేరుతోందని స్థానికులు మండిపడుతున్నారు. ప్రభుత్వాలు మారినా తమ జీవితాలు మాత్రం మారడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాతికోట ఉత్తర ద్వారం నుంచి పడమర ద్వారం వరకు నీరు నిలిచి ఉండడంతో అక్కడ సాగుచేసే ఆకుకూరలు, కూరగాయ తోటలు ఇంకా నీట మునిగే ఉన్నాయి. పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఫ్లడ్ లైట్లు కూడా వరదలోనే మునిగి ఉన్నాయి.
రోడ్లపై నీరు ఉండడంతో
బయటకు వచ్చేందుకు భయం
నిత్యావసరాలు లేక ఇబ్బందిపడుతున్న
లోతట్టుప్రాంతవాసులు
అసంపూర్తి అభివృద్ధి పనులతోనే
అవస్థలంటున్న జనం

ఇంకా తేరుకోలేదు..!