మన కుక్కల్ని ఏం చేద్దాం? | - | Sakshi
Sakshi News home page

మన కుక్కల్ని ఏం చేద్దాం?

Aug 12 2025 11:44 AM | Updated on Aug 12 2025 12:33 PM

మన కు

మన కుక్కల్ని ఏం చేద్దాం?

సాక్షి, వరంగల్‌:

గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌, నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో గుంపులు గుంపులుగా తిరుగున్న కుక్కలపై ఫిర్యాదులు రాగానే అక్కడినుంచి పట్టుకెళ్లి డాగ్‌ షెల్టర్లకు తరలించాక కుటుంబ నియంత్రణ, రేబిస్‌ వ్యాక్సిన్లు ఇచ్చి మళ్లీ నగరంలోనే వదిలేస్తుండడతో కుక్కల సంఖ్య యఽథావిధిగానే ఉంటోంది. జంతు సంరక్షణ చట్టం (ఏడబ్ల్యూపీఐ) 1960 , 2023 నిబంధనల ప్రకారం ఇదంతా చేస్తున్నా జనాలు మాత్రం కుక్కలు తీసుకెళ్లి మళ్లీ ఇక్కడే వదిలేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గ్రేటర్‌ వరంగల్‌ నగరంలో మొత్తం 28,460 వీధి కుక్కలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఓవైపు ఢిల్లీలో వీధి కుక్కల్ని డాగ్‌ షెల్టర్లకు తరలిస్తుంటే ఎవరైనా అడ్డుకుంటే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అక్కడి సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో మన కార్పొరేషన్‌ పరిధిలోనూ వీధి కుక్కల్ని డాగ్‌ షెల్ట ర్లకు శాశ్వతంగా తరలించే కార్యక్రమం చేపట్టాలనే డిమాండ్‌ నగరవాసుల నుంచి వస్తోంది. అదే సమయంలో జంతు ప్రేమికులు మాత్రం వీధి కుక్కల పట్ల కఠినంగా ఉండొద్దని, కాటు వేసే కుక్కల్ని గుర్తించి రేబిస్‌ వ్యాక్సిన్‌ ఇచ్చి సురక్షిత ప్రాంతంలో ఉంచాలంటున్నారు. ఇటు జనాలు, అటు జంతు ప్రేమికుల మధ్యలో కార్పొరేషన్‌ నలిగిపోతుందనే చర్చ నడుస్తోంది. ఇక్కడ కూడా నగర శివారుల్లో డాగ్‌ షెల్టర్‌ జోన్లు పెంచాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కంట్రోల్‌లోకి తెచ్చేందుకు మహా ప్రయత్నం

వాస్తవానికి ఆరు నెలలు దాటి ఏడాది వయస్సున్న కుక్కల్ని కుటుంబ నియంత్రణకు బల్దియా అధికారులు తీసుకెళ్తున్నారు. దాదాపు 12 నుంచి 15 సంవత్సరాలు బతికే ఈ కుక్కలకు ఒక్కో ఆడ కుక్క ఏడాదికి రెండు ఈతలు.. దాదాపు 16 కుక్కపిల్లలకు జన్మనిస్తుంది. అంటే ఐదేళ్లలో ఒక్కో కుక్క 90 పిల్లల వరకు జన్మనిస్తుంది. గతేడాది 2024–25 సంవత్సరంలో రూ.68 లక్షలకుపైగా ఖర్చు చేసి 6,154 కుక్కలకు కుటుంబ నియంత్రణతో పాటు రేబిస్‌ వ్యాక్సిన్లు ఇచ్చారు. మూడురోజుల పాటు సంరక్షించాక జనావాసాల్లోకి వదిలారు. కొన్ని సంవత్సరాలుగా వేలల్లో ఉన్న కుక్కలకు కుటుంబ నియంత్రణతో కంట్రోల్‌లోకి తేగలిగామని, ఇప్పటికి వాటిపైనే దృష్టి కేంద్రీకరించామని చెబుతున్నారు. ఇంకోవైపు సమస్యాత్మక ప్రాంతాల్లో బహిరంగ ప్రాంతాలతో పాటు పాఠశాలల్లో అవగాహన కల్పిస్త్తున్నామంటున్నారు.

ఫిర్యాదు చేయాలంటే..

కుక్క కాటు వేస్తే 18004251980తో పాటు ప్రజారోగ్య అధికారి ఫోన్‌ నంబర్‌ 9701999689, మున్సిపల్‌ ఆరోగ్య అధికారి ఫోన్‌ నంబర్‌ 97019 99639 పశువైద్యాధికారి ఫోన్‌ నంబర్‌ 97019 99701కు వాట్సాప్‌ మెసేజ్‌లు, ఫోన్‌ కాల్స్‌ ద్వారా ఫిర్యాదులు చేయొచ్చు. ప్రతీరోజు 12 నుంచి 15 ఫిర్యాదులొస్తున్నాయి. షెల్టర్‌ జోన్లకు కుక్కలను తరలించేందుకు 12మందితో మూడు బృందాలు పనిచేస్తున్నాయి.

శాశ్వత ఆశ్రయ గృహాలు ఏర్పాటు చేయాలి...

గ్రేటర్‌ వరంగల్‌తో పాటు వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో జూన్‌, జూలై నెలల్లోనే 712 కుక్క కరిచిన ఘటనలు నమోదయ్యాయి. కార్పొరేషన్‌ పరిధిలో పట్టుబడిన వీధి కుక్కలకు శాశ్వత ఆశ్రయ గృహాలు ఏర్పాటు చేసి, అక్కడే ఉంచి ఆహారం, వైద్యసేవలు అందించాలి.

– మండల పరశురాములు, అధ్యక్షుడు,

అభ్యుదయ సేవా సమితి, వరంగల్‌

‘గ్రేటర్‌’ పరిధిలో వీధి కుక్కల బెడద

ప్రజావాణిలో ఒక్కరోజే

నాలుగు ఫిర్యాదులు

వీధులనుంచి పునరావాస కేంద్రాలకు తరలించాలని వినతి

జంతు సంరక్షణ చట్టం నిబంధనలతోనే బల్దియాకు మహా సంకటస్థితి

ఢిల్లీ ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో కుక్కలపై సుప్రీం ఆదేశాల నేపథ్యంలో చర్చ

ఇక్కడ కూడా డాగ్‌ షెల్టర్‌ జోన్లు పెంచితే మంచిదంటున్న జనం

ఢిల్లీలోని నేషనల్‌ క్యాపిటల్‌ టెరీటరీతోపాటు నోయిడా, గుర్గావ్‌, ఘజియాబాద్‌ ప్రాంతాల్లో అన్ని వీధి కుక్కలను డాగ్‌ షెల్టర్లకు ఎనిమిది వారాల్లో తరలించాలి. ఈనేపథ్యంలో వీధి కుక్కలను అధికారులు తీసుకెళ్లకుండా ఎవరైనా వ్యక్తి లేదా సంస్థ అడ్డుకుంటే, వారు చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది’.

– తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలు

‘కాజీపేటలోని ప్రశాంత్‌ నగర్‌, కాకతీయ కాలనీ ఫేజ్‌–టు, వరంగల్‌లో రంగశాయిపేట, రైల్వే స్టేషన్‌ ప్రాంతాల్లో వీధి కుక్కల్ని తీసుకెళ్లాలి. వరుస కాట్లతో ఇబ్బందులు పడుతున్నాం. ఈ బెడద నుంచి కార్పొరేషన్‌ అధికారులు తప్పించాలి.

– సోమవారంనాటి బల్దియా ప్రజావాణిలో వచ్చిన నాలుగు ఫిర్యాదులు

మన కుక్కల్ని ఏం చేద్దాం?1
1/1

మన కుక్కల్ని ఏం చేద్దాం?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement