
చిరు దరహాసం
‘ఆపరేషన్ స్మైల్.. ఆపరేషన్ ముస్కాన్’తో చిన్నారులకు భరోసా
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ఇతర శాఖల సమన్వయంతో ప్రతీ ఏటా జనవరిలో ఆపరేషన్ స్మైల్, జూలైలో ఆపరేషన్ ముస్కాన్ పేరిట 2015 నుంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బడీడు పిల్లలు బడిలో ఉంటేనే ఆకుటుంబ ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని అన్ని శాఖల అధికారులు ఈ కార్యక్రమాలను యజ్ఞంలా చేపడుతున్నారు. 2015 నుంచి 2016వ సంవత్సరం వరకు ఉమ్మడి వరంగల్ జిల్లా, 2017 నుంచి 2021 వరకు వరంగల్ అర్బన్ జిల్లాలో, 2022 నుంచి 2025 సంవత్సరం వరకు హనుమకొండ జిల్లాలో 2,481 మంది చిన్నారులకు పనినుంచి విముక్తి కల్పించారు.
డివిజన్‌కు 8 మంది సభ్యుల బృందం..
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతీ డివిజన్‌లో ఎస్సై, సహాయ కార్మికశాఖ అధికారి, ఏఎస్సై, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్, మహిళా పోలీస్ కానిస్టేబుల్, జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధి కారి, చైల్డ్‌లైన్ అధికారులు బృందంగా పని చేస్తున్నారు. 14 ఏళ్లలోపు చిన్నారులను పనిలో పెట్టుకున్న యజమానులపై కేసులు నమోదు చేస్తున్నారు.
చట్టాలు ఇలా..
చిన్నారులను పనిలో పెట్టుకుని శ్రమ దోపిడీకి గురి చేసే యజమానులపై బాలకార్మిక వ్యవస్థ నిషేధ, నియంత్రణ చట్టం 1996 (సవరణ 2016లో మా ర్పు చేసి చట్టాన్ని ది చైల్డ్ అండ్ అడాల్‌సెంట్ లేబర్ యాక్ట్ 1986) జువైనల్ జస్టిస్ యాక్ట్‌లు పరిగణనలోకి వస్తాయి.బాలకార్మికులను ప్రోత్సహిస్తూ తొలి సారి పట్టుబడితే ఆరు నెలల నుంచి రెండేళ్ల వరకు జైలు శిక్ష, రూ.20 వేలు నుంచి 50 వేల వరకు జరిమానా విధిస్తారు. రెండోసారి అదే తప్పిదం జరిగితే ఏడాది పాటు జైలు శిక్షతో పాటు రూ.50 వేల నుంచి లక్ష వరకు జరిమానా విధిస్తారు.
బాలకార్మిక వ్యవస్థ రహిత సమాజమే లక్ష్యం
ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ ద్వారా బాల కార్మిక వ్యవస్థ రహిత సమాజ నిరా్మాణమే లక్ష్యంగా అన్ని శాఖల సమన్వయంతో పని చేస్తున్నాం. బడీడు పిల్లలను బడిలో చేర్పించడంతో పాటు ఇతర రాష్ట్రాల పిల్లలను వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చేందుకు కృషి చేస్తున్నాం.
– జయంతి, సీ్త్ర, శిశు సంక్షేమాధికారి,
హనుమకొండ జిల్లా
‘బాలలు ఉండాల్సింది బడిలో.. పనిలో కాదు’ ఈ నినాదంతో దూసుకెళ్తున్నారు వరంగల్ కమిషరేట్ పరిధి పోలీసులు, ఇతర శాఖల అధికారులు. బాలల బంగారు భవిష్యత్‌ను రక్షిస్తూ వారి పెదాల్లో చిరునవ్వులు విరబూయిస్తున్నారు. ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ పేరిట విస్తృత తనిఖీలు చేపడుతూ.. బాలలకు పని నుంచి విముక్తి కల్పిస్తూ బడిలో చేర్పిస్తున్నారు. – కాజీపేట అర్బన్
హనుమకొండ జిల్లా వ్యాప్తంగా ఇలా
ఆపరేషన్ స్మైల్
సంవత్సరం బాలురు బాలికలు కేసులు
2022 జనవరి 96 16 2
2023 జనవరి 86 9 4
2024 జనవరి 32 3 1
2025 జనవరి 25 6 2
ఆపరేషన్ ముస్కాన్..
సంవత్సరం బాలురు బాలికలు కేసులు
2022 జూలై 86 9 4
2023 జూలై 38 9 2
2025 జూలై 36 8 4
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆపరేషన్ ముస్కాన్ ద్వారా ఈఏడాది జూలైలో 177 మంది చిన్నారులకు విముక్తి కల్పించారు. వీరిలో 149 మంది బాలలు, 28 మంది బాలికలు ఉన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 97 మంది ఉన్నట్లుగా గుర్తించారు. వీరందరిని తల్లిదండ్రులకు అప్పగించినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు.
2015 నుంచి 2,481 మంది
చిన్నారులకు విముక్తి
బాలకార్మిక రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం: పోలీసులు, అధికారులు

చిరు దరహాసం