‘దేవాదుల’ గట్టెక్కించేనా? | - | Sakshi
Sakshi News home page

‘దేవాదుల’ గట్టెక్కించేనా?

Published Wed, Mar 19 2025 1:08 AM | Last Updated on Wed, Mar 19 2025 1:08 AM

‘దేవా

‘దేవాదుల’ గట్టెక్కించేనా?

సాక్షిప్రతినిధి, వరంగల్‌/హసన్‌పర్తి/ధర్మసాగర్‌: వేసవి ఎండల తీవ్రత.. అడుగంటుతున్న భూగర్భజలాలు.. దీంతో జనగామ, హనుమకొండ జిల్లాల్లోని నాలుగు నియోజకవర్గాల్లో అక్కడక్కడ పంటలు ఎండుతున్నాయి. చేతికందే దశలో దేవాదుల ప్రాజెక్టు పరిధిలో వరి పంటలు దెబ్బతింటున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాజెక్టు కింద 50 నుంచి 60వేల ఎకరాలకు సాగునీరందించేలా దేవాదుల ప్రాజెక్టు మూడో దశలో భాగంగా దేవన్నపేటలో నిర్మించిన పంప్‌హౌజ్‌ మోటార్లను జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించేందుకు మంగళవారం సాయంత్రం పంపుహౌజ్‌కు చేరుకున్నారు. కానీ, మోటారు మరమ్మతుకు రావడం, ఆస్ట్రియానుంచి వచ్చిన బృందం చేపట్టిన రిపేర్లు పూర్తి కాకపోవడంతో మంత్రులు రాత్రి ఎన్‌ఐటీ గెస్టుహౌస్‌లో ఉన్నారు. అసెంబ్లీలో బుధవారం బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో రాత్రి 11.30 గంటలకు హైదరాబాద్‌కు వెళ్లిపోయారు.

ఫేజ్‌–3 పనులపైనే దృష్టి...

దేవన్నపేట పంపుహౌజ్‌లో ప్రస్తుతం ఒక్కో మోటారు 800 క్యూసెక్కుల నీటిని లిఫ్ట్‌ చేస్తోంది. ప్రస్తుతం ఇక్కడ మూడు మోటార్లు ఏర్పాటు చేయగా.. అందులో ఒకటి ఆన్‌చేసి జనగామ, పాలకుర్తి, స్టేషన్‌ ఘన్‌పూర్‌, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో సుమారు 60వేల నుంచి 65వేల ఎకరాల వరకు సాగునీరు అందించడంపై దృష్టి పెట్టారు. మంగళవారం రాత్రి వరకు మోటారు మొరాయించడంతో ఈ యాసంగి పంట చేతికందే వరకు నీటి సరఫరా అవుతుందా? అన్న ఆందోళన ఆ నాలుగు నియోజకవర్గాల్లోని రైతుల్లో వ్యక్తమవుతోంది.

హడావుడిగా సాగిన మంత్రుల పర్యటన..

దేవాదుల చివరి ఆయకట్టుకు సాగునీరందిచేందుకు యుద్ధప్రాతిపదికన ఖరారైన మంత్రుల టూర్‌ హడావిడిగా సాగింది. మొదట మంత్రులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలు హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌ ద్వారా హసన్‌పర్తి మండలం దేవన్నపేటకు పంప్‌హౌజ్‌కు చేరుకున్నారు. అక్కడినుంచి ధర్మసాగర్‌ రిజర్వాయర్‌లో నీరు పంపింగ్‌ అయ్యేలా మోటార్‌ ఆన్‌ చేయాల్సి ఉంది. అనంతరం ధర్మసాగర్‌ రిజర్వాయర్‌కు చేరుకుని అక్కడ పూజలు చేసి.. మీడియా సమావేశంలో మాట్లాడుతారనేది షెడ్యూల్‌. కానీ, అనుకున్న ప్రకారం దేవన్నపేటకు మంత్రులు చేరుకున్నప్పటికీ మోటార్‌ మొరాయించడంతో స్విచాన్‌ చేయకుండా అక్కడే అధికారులతో సమీక్ష నిర్వహించారు. ధర్మసాగర్‌ రిజర్వాయర్‌ వద్ద వేసిన టెంట్లు, కుర్చీల వద్దే ప్రజలు, కార్యకర్తలు ఉండిపోయారు. చివరి నిమిషంలో మీడియా సమావేశం దేవన్నపేటలోనే ఉంటుందనడంతో ధర్మసాగర్‌ నుంచి దేవన్నపేటకు మీడియాతోపాటు నాయకులు, కార్యకర్తలు, అధికారులు పరుగులు పెట్టారు. పలుచోట్ల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల పక్కన ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, యశస్విని రెడ్డి తదితరుల ఫొ టోలు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.

అధికారులపై మంత్రి ఉత్తమ్‌ ఆగ్రహం

దేవాదుల ప్రాజెక్టు దశలు ఎప్పుడు ప్రారంభమ య్యాయని, ఇతర అంశాలపై మంత్రులు అడిగిన ప్రశ్నలకు నీటిపారుదల శాఖ అధికారుల నుంచి సరైన సమాధానం లేదు. దీంతో వారిపై మంత్రి ఉత్తమ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమీక్షకు సమాచారం లేకుండా వట్టి చేతులతో వస్తారా అని మండిపడ్డారు. చిన్న చిన్న సమస్యలతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, జిల్లా కలెక్టర్‌ ప్రావీణ్య, బల్దియా కమిషనర్‌ అశ్వినీ తానాజీ వాకడే, ఆయిల్‌ ఫెడ్‌ చైర్మన్‌ జంగా రాఘవరెడ్డి, కుడా చైర్మన్‌ వెంకట్రాంరెడ్డి, మేయర్‌ గుండు సుధారాణి, టీపీసీసీ మాజీ కార్యదర్శి నమిండ్ల శ్రీనివాస్‌, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా మాజీ అధ్యక్షుడు సురేందర్‌రెడ్డితోపాటు దేవాదుల ఉన్నతాఽధికారులు పాల్గొన్నారు.

రాత్రి వరకు కాని మోటార్‌ మరమ్మతు

చివరి ఆయకట్టు రైతుల్లో ఆందోళన

హడావుడిగా సాగిన

మంత్రుల పర్యటన

‘ధర్మసాగర్‌ రిజర్వాయర్‌’

కార్యక్రమం రద్దు

దేవన్నపేట పంపుహౌజ్‌కు

హుటాహుటిన అధికారులు

‘దేవాదుల’ గట్టెక్కించేనా?1
1/1

‘దేవాదుల’ గట్టెక్కించేనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement