
మొక్కుల నడుమ గద్దెకు చేరిన సమ్మక్క..
మేడారం (ఏటూరునాగారం/ఎస్‌ఎస్‌తాడ్వాయి):
చిలకలగుట్టనుంచి సమ్మక్క తల్లి మేడారం గద్దైపెకి చేరడంతో మహాజాతర పరిపూర్ణత సంతరించుకుంది. ఇప్పటికే సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపైకి చేరడంతో భక్తుల మొక్కులు జోరందుకున్నాయి. గురువారం రాత్రి చిలకలగుట్టనుంచి పూజారులు, వడ్డెలు సమ్మక్కను భక్తుల జయజయధ్వానాల నడుమ తీసుకొచ్చి గద్దైపె ప్రతిష్ఠించారు. దారిపొడవునా డోలు వాయిద్యాలు, ఆదివాసీల నృత్యాలు ఆకట్టుకున్నాయి. పూనకాలతో శివసత్తులు ఊగిపోయారు. జై సమ్మక్క.. జైజైసమ్మక్క.. తల్లీ శరణు.. జయహో జగజ్జనని.. సల్లంగాచూడు తల్లి అంటూ భక్తుల నామస్మరణ మార్మోగింది.
గద్దెల వద్ద ప్రత్యేక పూజలు..
తెలంగాణ కుంభమేళా మేడారం జాతరలో ప్రధాన ఘట్టం సమ్మక్క ఆగమనం. తల్లిరాకతోనే జాతర సంపూర్ణమవుతుంది. కాగా, గురువారం మేడారంలోని సమ్మక్క గుడి శక్తిపీఠం వద్ద పూజారులు, వడ్డెలు సంప్రదాయ దుస్తులు ధరించి కుంకుమ, పసుపు, ఇతర పూజాసామగ్రిని పట్టుకొని గద్దెల వద్దకు చేరి ప్రత్యేక పూజలు చేశారు. సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజుకు పసుపు కుంకుమ అప్పగించిన తర్వాత పూజారులు చిలకలగుట్టకు చేరుకున్నారు.
వెళ్లింది వీరే..
సమ్మక్క కొలువై ఉన్న చిలకలగుట్టపైకి ఐదుగురు పూజారులు వెళ్లారు. ప్రధాన పూజారి సిద్ధబోయిన ముణెందర్, జలకం వడ్డె మల్లెల ముత్తయ్య, ధూపం వడ్డె దోబె నాగేశ్వర్‌రావు, అమ్మవారిని తీసుకువచ్చే ప్రధాన వడ్డె కొక్కెర క్రిష్ణయ్య, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు వెళ్లారు. అవిరేణికుండలు, కుంకుమభరిణె, బంగారు కడియాలకు ఆదివాసీ సంప్రదాయబద్ధంగా రహస్య పూజలు చేశారు. క్రతువు పూర్తయ్యేవరకు అక్కడికి ఎవరిని అనుమతించలేదు. భారీపోలీసు బందోబస్తు మధ్య గుట్ట వద్ద రెండు గంటలు క్రతువు నిర్వహించారు. ప్రజలు సుభిక్షంగా ఉండడానికి జనం మధ్యలోని గద్దైపెకి రావాలని అమ్మవారికి ఆహ్వానం పలికారు. అమ్మవారు కొన్ని షరతులు విధిస్తే వాటికి పూజారులు ఒప్పుకుని తల్లిని గద్దె మీదకు తీసుకొచ్చేందుకు మొక్కు చెల్లించారు. అమ్మవారినికి తీసుకొచ్చి గుట్టకు వందమీటర్ల దూరంలో ఉన్న క్రిష్ణయ్యకు అప్పగించారు.
శక్తి ఆవహించి..
మదిరిగుడ్డ(ఎర్రవస్త్రం)లోని అమ్మవారి ప్రతిరూపాన్ని అప్పగించగానే క్రిష్ణయ్యను శక్తి ఆవహించి ఒక్కసారిగా ఊగిపోయాడు. పూజారులు సిద్ధబోయిన స్వామి, జనార్దన్, సిద్ధార్థ్, రమేష్ కొమ్ము ఊదగా డోలువాయిద్యాలు మోగించారు. అప్పటికే తండోపతండాలుగా తరలివచ్చిన భక్తులు ‘జయహో సమ్మక్క... త ల్లీ వందనం’ అంటూ రెండు చేతులు జోడించి మొక్కారు. అక్కడి నుంచి సిద్ధబోయిన వంశీయులు, పూజారులు కలిసి అమ్మవారిని గుట్ట కిందకు తీసుకురాగానే ప్రభుత్వ లాంఛనాలతో గౌరవ వందనంగా ఏకే–47తో ములుగు ఎస్పీ శబరీశ్ గుట్టదిగే సమయం లో.. చిలకలగుట్ట గేట్ ముందు, గేట్ దాటాక (మొత్తం మూడు రౌండ్లు) గాల్లోకి కాల్పులు జరిపి స్వాగతం పలికారు.
రోప్‌పార్టీ, ఆదివాసీ యూత్ ఆధ్వర్యంలో..
పోలీసులు, ఆదివాసీ యూత్‌తో కూడిన నాలుగు అంచెల రోప్‌పార్టీ భద్రత నడుమ అమ్మవారు గద్దైపెకి బయలుదేరారు. తల్లి ఆగమనాన్ని తిలకించేందుకు వేలాదిమంది భక్తులు మేడారం గద్దెల నుంచి గుట్ట వరకు బారులుదీరారు. భక్తులు దారిలో రంగు రంగుల ముగ్గులు వేసి, కోళ్లు, మేకలను బలిచ్చి రక్తంతో స్వాగతం పలికారు. శివసత్తులు, భక్తులు పూనకంతో ఊగిపోయారు. భక్తులు అమ్మవారిని తాకేందుకు రోప్‌పార్టీ దాటే ప్రయత్నాలు చేశారు. ఆదివాసీ యూత్ సభ్యులను కూడా దాటి అమ్మవారిని తాకడానికి భక్తులు పోటీపడ్డారు. పూజారులు, వడ్డెలను తాకనివ్వకుండా ప్రతిఘటించి అమ్మవారిని తీసుకువచ్చారు.
ఎదుర్కోళ్లు.. మొక్కులు
చిలకలగుట్ట నుంచి మేడారం గద్దెకు వచ్చేదారి మధ్యలోని ఎదుర్కోళ్ల మండపానికి అమ్మవారిని తీసుకెళ్లారు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న అర్రెం, పెనక వంశస్తులు.. సిద్ధబోయిన వంశస్తులకు వాయినాలు ఇచ్చారు. ఒకరిపై ఒకరు అక్షింతలు చల్లుకొని నోరు తీపిచేసుకొని బయలుదేరారు. అక్కడి నుంచి మేడారం గ్రామ ప్రధాన కూడలికి రాగానే స్థానిక ఆడపడుచులు అమ్మవారికి ఎదురెళ్లి మంగళహారతులతో నీళ్లు ఆరబోసి స్వాగతం పలికారు. చిలకలగుట్ట ప్రధాన దారి ఈశాన్యానికి తిరిగి మూడుసార్లు ఎడమ, కుడివైపు దండాలు పెట్టారు. ప్రధాన ద్వారం గుండా పగిడిద్దరాజు గద్దె వద్ద మూడుమార్లు ప్రదక్షిణలు చేశారు. అక్కడి నుంచి సమ్మక్కను గద్దైపెకి తీసుకువచ్చారు. అమ్మవారు రావడంతో విద్యుత్ లైట్లను పూర్తిగా నిలిపివేశారు. గద్దైపె ఏర్పాటు చేసిన కంకవనం వద్ద అమ్మవారి ప్రతిష్ఠ తంతు కనిపించకుండా చుట్టూ చీరలు కట్టారు. అనంతరం లైట్లను ఆన్ చేయడంతో భక్తులందరూ తల్లివైపు చూస్తూ జయజయధ్వానాలు పలికారు. అనంతరం పూజారులు గద్దె నుంచి మేడారంలోని సమ్మక్క గుడికి వెళ్లారు.
సమ్కక్క తల్లిని చిలకలగుట్ట నుంచి తీసుకువస్తుండగా వడ్డెలు, పూజారులు, భక్తులు వెంట తరలివచ్చారు. పూనకాలతో శివసత్తులు ఊగిపోయారు. (ఇన్‌సెట్‌లో) గాల్లో కాల్పులు జరుపుతున్న ములుగు ఎస్పీ శబరీష్, వనదేవత
రాకను కనులారా వీక్షించడానికి భక్తులు చెట్లు ఎక్కారు.
ఒకేరోజు నలుగురు దేవరలు
గద్దెలపైకి ఒకేరోజు (గంటల వ్యవధిలో) నలుగురు దేవరలు చేరినట్లయ్యింది. బుధవారం రాత్రి 12.12 గంటలకు (అంటే గురువారం అయినట్లే) సారలమ్మ, ఆ తర్వాత కొద్దిసేపటికే గోవిందరాజులు, పగిడిద్దరాజు గద్దెలపైకి చేరారు. గురువారం రాత్రి 9:29 గంటలకు సమ్మక్క వచ్చింది. దీంతో తల్లీబిడ్డలతోపాటు మరో ఇద్దరు ఒకేరోజు వచ్చినట్లయ్యింది.
చిలకలగుట్టపైకి వెళ్లింది ఐదుగురే..
ఆదివాసీ సంప్రదాయాలతో ప్రత్యేక పూజలు
అధికార లాంఛనాలతో గుట్ట దిగిన సమ్మక్క
ధూపంతోనే ముందుకు సాగిన తల్లి
మదిరగుడ్డలో కుంకుమభరిణె,
బంగారు కడియాలు
జిలకం నీళ్ల ఆరగింపుతో మేడారం వైపు పయనం
దారిపొడవునా రంగవళ్లికలు.. భక్తుల దండాలు
కోళ్లు, మేకలను బలిస్తూ స్వాగతం
అమ్మవారిని తాకేందుకు తీవ్ర ప్రయత్నాలు
గద్దైపెకి చేరాక జాతరకు పరిపూర్ణత..
దర్శించుకుని భక్తుల తన్మయత్వం

గురువారం రాత్రి వనదేవతలను దర్శించుకోవడానికి ఆవరణలో నిరీక్షిస్తున్న భక్తజనం

గద్దెల ప్రాంగణంలో కిక్కిరిసిన భక్తులు
