కాజీపేట అర్బన్ : అమ్మవారిపేట సమ్మక్క–సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలుగకుండా చూడాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు సూచించారు. జాతర ప్రాంగణంలో మంగళవారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలకు ప్రత్యేకంగా మొబైల్ టాయిలెట్స్, తాగునీరు, విద్యుత్, వైద్య సౌకర్యాలను కల్పించాలని తెలిపారు. కాగా, జాతర నిర్వహించే ప్రాంతం ప్రైవేట్ స్థలమని, శాశ్వతంగా ప్రభుత్వ భూమిని కేటాయించాలని, బస్సు సౌకర్యం కల్పించాలని, అమ్మవారిపేట నుంచి రంగశాయిపేట వరకు రోడ్డు నిర్మాణం చేపట్టాలని జాతర కమిటీ సభ్యులు, భక్తులు కోరారు. త్వరలో బస్సు సౌకర్యంతో పాటు అమ్మవారిపేట ప్రధాన రహదారిపై ఆర్చీ నిర్మాణం చేపట్టేందుకు కృషి చేస్తానని ఎమ్మె ల్యే హామీ ఇచ్చారు. సమీక్షలో కార్పొరేటర్ జలగం అనిత, జీడబ్ల్యూఎంసీ అడిషనల్ కమిషనర్ అని సుర్ రషీద్, తహసీల్దార్ భావుసింగ్, ఈఓ కమల, ఆర్‌ఐలు సురేందర్, దశరథరాంరెడ్డి పాల్గొన్నారు. కాగా, అమ్మవారిపేటలో బుధవారం నుంచి జరగనున్న జాతరకు అన్ని ఏర్పాట్లు చేశారు.