వసతుల కల్పన, సమస్యలపైనే అర్జీలు

దరఖాస్తులు స్వీకరిస్తున్న వింగ్‌ అధికారులు - Sakshi

బల్దియా గ్రీవెన్స్‌ సెల్‌కు 60 ఫిర్యాదులు

వరంగల్‌ అర్బన్‌: కాలనీల్లో మౌలిక వసతుల కల్పన, వ్యక్తిగత సమస్యలపైనే అధికంగా ఫిర్యాదులు నమోదయ్యాయి. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో వింగ్‌ అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 60 ఫిర్యాదులు రాగా.. వాటిలో తాగునీటి సమస్యలపై 9, అక్రమ నిర్మాణాలపై(టౌన్‌ ప్లానింగ్‌) 31, పన్నుల విభాగానికి 9, ఉద్యానవన విభాగానికి 3, ప్రజారోగ్యానికి 2, ఇంకా ఇతర ఫిర్యాదులు నమోదయ్యాయి. కార్యక్రమంలో అడిషనల్‌ కమిషనర్‌ రవీందర్‌ యాదవ్‌, డిప్యూటీ కమిషనర్లు అనిసుర్‌ రషీద్‌, జోనా, ఎస్‌ఈలు కృష్ణారావు, ప్రవీణ్‌చంద్ర, సిటీ ప్లానర్‌ వెంకన్న, సీహెచ్‌ఓ మాధవరెడ్డి, సీఎంహెచ్‌ఓ రాజేష్‌, ఎంహెచ్‌ఓ జ్ఞానేశ్వర్‌, ఈఈలు,డీఈలు, ఏసీపీలు తదితరులు పాల్గొన్నారు.

ఫిర్యాదుల్లో కొన్ని ఇలా..

● రామన్నపేట 12–8–171/2 నల్లా పైపులైన్‌ నుంచి మురుగునీరు వస్తుందని, బిల్లు సక్రమంగా చెల్లిస్తున్నానని కె.సంతోష్‌కుమార్‌ ఫిర్యాదు చేశారు.

● 11 డివిజన్‌ పోతన నగర్‌ శ్మశాన వాటికలో కనీస సదుపాయాలు కల్పించాలని, ఏఈకి ఎన్నిమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని సందెల కుమార్‌ ఫిర్యాదు చేశారు.

● 36వ డివిజన్‌ చింతల్‌ డ్రెయినేజీ లేక ఇళ్ల మధ్యలో ఖాళీ స్థలాల్లో మురికి కూపాలుగా మారుతున్నాయని, వెంటనే పనులు చేపట్టాలని స్థానికులు కోరారు.

● పైడిపల్లికి చెందిన కుమారస్వామి తన భవన నిర్మాణానికి దరఖాస్తు చేసి రూ.75,282 చెల్లించానని, దానిని రిజెక్ట్‌ చేశారని, తిరిగి డబ్బులు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.

● జాన్‌పీరీలకు చెందిన సమ్మయ్య తన ఇంటి పేరు లేకుండా తన ఇంటిని అసెస్‌మెంట్‌ కాపీతో తప్పుడు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాడని, దానిని రద్దు చేయాలని శ్రీరాముల సమ్మయ్య వినతిపత్రం అందజేశారు.

● 64వ డివిజన్‌ మడికొండలో డ్రెయినేజీ నిర్మించాలని స్థానికులు వినతిపత్రం అందజేశారు.

● బాలసముద్రంలోని పిల్లల పార్కులో ఫొటోలు తీసుకుంటే రూ.5వేల నుంచి రూ.10వేల వరకు వసూలు చేస్తున్నారని, చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.

● వరంగల్‌ కాశికుంట హిందూ ఆరెకటిక శ్మశాన వాటిక పనులు నత్తనడకన సాగుతున్నాయని, వాటిని వేగవంతం చేయాలని అధ్యక్షుడు గోగికార్‌ రవీందర్‌ కోరారు.

● ఏనుమాముల సుందరయ్య నగర్‌లో సర్వే నం.180 ప్రభుత్వ భూమి సర్వే చేసి కాపాడాలని తెలుగు బాప్టిస్ట్‌ చర్చి ప్రతినిధులు విన్నవించారు.

● వాటర్‌ ట్యాంక్‌ల ఆపరేటర్లకు యూనిఫాం ఇప్పించాలని టీఆర్‌ఎస్‌కేవీ నాయకుడు కొత్తపల్లి శ్రీనివాస్‌, ఆపరేటర్లు అర్జీ అందజేశారు.

Read latest Hanamkonda News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top