నేడే ఎంటీఎంసీ ఎన్నికల సమరం | - | Sakshi
Sakshi News home page

నేడే ఎంటీఎంసీ ఎన్నికల సమరం

Nov 26 2026 1:29 AM | Updated on Nov 26 2026 1:29 AM

● 62 డివిజన్లలో పోలింగ్‌కు సర్వం సిద్ధం ● 261 పోలింగ్‌ కేంద్రాలకు సామగ్రితో చేరుకున్న సిబ్బంది 1,443 మందితో బందోబస్తు

2.37 లక్షల మంది ఓటర్లు..

మంగళగిరి టౌన్‌: మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థ (ఎంటీఎంసీ) తొలి ఎన్నికల సమరానికి రంగం సిద్ధమైంది. గురువారం జరగనున్న పోలింగ్‌కు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నగరపాలక సంస్థ పరిధిలోని 62 డివిజన్లలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన పోలింగ్‌ సామగ్రిని బుధవారం సాయంత్రానికే ఆయా కేంద్రాలకు చేర్చారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో పోలీసు భద్రత నడుమ ఎన్నికల సిబ్బంది సామగ్రితో పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. సిబ్బందికి అవసరమైన సౌకర్యాలు కల్పించారు. మొత్తం 261 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బారికేడ్లు, క్యూలైన్లు ఏర్పాటు చేశారు. టెంట్లు వేశారు.

ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. మొత్తం 1,443 మంది పోలీసు సిబ్బందిని ఎన్నికల విధులకు నియమించారు. వీరిలో ఒక అదనపు ఎస్పీ, ఏడుగురు డీఎస్పీలు, 19 మంది సీఐలు, 96 మంది ఎస్‌ఐలు, 182 మంది ఏఎస్‌ఐలు, హెడ్‌ కానిస్టేబుళ్లు, 739 మంది పోలీసు కానిస్టేబుళ్లు, 100 మంది హోంగార్డులు, 299 మంది మహిళా పోలీసు సిబ్బంది ఉన్నారు. వీరితో పాటు 48 రూట్‌ మొబైల్‌ పార్టీలు, 12 స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ పార్టీలు, ఒక స్పెషల్‌ స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ పార్టీని ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాలు, పోలింగ్‌ కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా ఉంచనున్నారు. మొత్తం 261 పోలింగ్‌ కేంద్రాల్లో 261 మంది పీవోలు, 261 మంది ఏపీవోలు, 800 మంది ఇతర సిబ్బందిని నియమించారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో ఒక పీవో, ఒక ఏపీవో, నలుగురు ఇతర సిబ్బంది కలిపి మొత్తం ఆరుగురిని ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో రెండు సీసీ కెమెరాలతో పాటు, సమస్యాత్మక కేంద్రాల్లో వీడియో గ్రాఫర్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను పోలీసు అధికారులు ముందుగానే పరిశీలించారు. మొత్తంగా ఎన్నికల సామగ్రి తరలింపు, సిబ్బంది విధుల కేటాయింపు, పోలింగ్‌ కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలు, పోలీసు బందోబస్తు వంటి ఏర్పాట్లన్నీ పూర్తికావడంతో గురువారం జరిగే పోలింగ్‌కు ఎంటీఎంసీ యంత్రాంగం సిద్ధమైంది. ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేసింది.

ఈ ఎన్నికల్లో మొత్తం 2,37,711 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 1,14,353 మంది పురుషులు, 1,23,350 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మహిళా ఓటర్ల తీర్పు కీలకంగా మారనుంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలో నిలవడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. రీపోలింగ్‌ అవసరమైతే నవంబర్‌ 27న నిర్వహించనున్నారు. 30న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement