గుటూరు మెడికల్: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గుంటూరు శాఖ అధ్యక్షునిగా 2025– 2026లో డాక్టర్ తాతా సేవకుమార్ వైద్యులకు, ప్రజలకు, సమాజపరంగా చేసిన సేవలకు గుర్తింపుగా ‘ఐఎంఏ ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ అప్రిషియేషన్ అవార్డు’ లభించింది. 2025 నవంబర్‌లో ఐఎంఏ గుంటూరు శాఖ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ సేవ కుమార్ వైద్యులకు నిరంతర వైద్య విద్యా కార్యక్రమాలు(సీఎఈ లు) నిర్వహించడంతోపాటు మధుమేహం, హెచ్‌ఐవీ–ఎయిడ్స్, క్యాన్సర్ వంటి దీర్ఘకాల వ్యాధుల నియంత్రణకు చేపట్టిన ప్రజా చైతన్య కార్యక్రమాలు, మున్సిపల్ గ్రీన్ వర్కర్స్‌కు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాలలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఐఎంఏ రాష్ట్ర, సెంట్రల్ కౌన్సిల్‌లలో సభ్యునిగా ఉన్న డాక్టర్ టీ.సేవకుమార్ నవంబర్ 28న అమలాపురంలోని కోనసీమ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో జరిగే వార్షిక సదస్సులో ఈ అవార్డును ప్రముఖుల చేతుల మీదగా అందుకోనున్నారు. అదే సదస్సులో జోన్– 2 ఉపాధ్యక్షునిగా బాధ్యతలు కూడా చేపట్టబోతున్నారు.


