ఫిరంగిపురం: మండలంలోని రేపూడి గ్రామంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు గోడౌన్లలో భద్రపర్చిన ఈవీఎంలు, వీవీ ప్యాట్లను జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ బుధవారం తనిఖీ చేశారు. ప్రతినెలా సాధారణ తనిఖీల్లో భాగంగా భద్రత ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు పరిశీలించారు. ఎన్నికల సామగ్రి భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు తప్పనిసరని అన్నారు. ఈ విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించరాదని తెలిపారు. రికార్డులు ఎప్పటికప్పుడు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ జె.ప్రసాదరావు, సీఐ భుజంగరావు, రెవెన్యూ, ఇతర శాఖల సిబ్బంది ఉన్నారు.
మాచర్ల: తాగునీటి అవసరాలకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి కుడి కాలువకు గురువారం నీటిని విడుదల చేయనున్నట్లు ఎన్‌ఎస్‌పీ లింగంగుట్ల, కుడి కాలువ ఎస్‌ఈ రమేష్ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నీటి విడుదల వివరాలు వెల్లడించారు. మొత్తం తాగునీటి అవసరాల నిమిత్తం ప్రాజెక్టు నుంచి ఎనిమిది టీఎంసీలు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. నీటిని చెరువులు, కుంటలు, పురపాలక సంఘ స్టోరేజ్ ట్యాంక్‌లకు నింపుకోవాలన్నారు. సాగు నీటి అవసరాలకు ఉపయోగిస్తే చర్యలు తప్పవన్నారు. ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరూ తమకు సహకరించాలన్నారు.
గుంటూరు వెస్ట్(క్రీడలు): జిల్లా జూడో సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం మంగళగిరిలోని డాన్ బాస్కో హైస్కూల్లో జిల్లా జూడో సీనియర్ జట్టు ఎంపికలు జరుగుతాయని సంఘం కార్యదర్శి బి.కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు 2011 ముందు జన్మించిన వారై ఉండాలన్నారు. వయసు ధ్రువీకరణ పత్రంతోపాటు ఆధార్ కార్డు తీసుకొని శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు డాన్ బాస్కో హైస్కూల్ – మంగళగిరిలో హాజరు కావాలని తెలిపారు. ఇతర వివరాలకు 99660 99120 ఫోన్ నంబరును సంప్రదించాలన్నారు.
ఆర్టీసీ బస్సు చార్జీల్లో రాయితీ
పట్నంబజారు: ఏపీఎస్ ఆర్టీసీ గుంటూరు జిల్లాలోని ఏసీ బస్సుల్లో ప్రయాణించేవారికి అధికారులు శుభవార్త అందించారు. ఆర్టీసీ రీజియన్ మేనేజర్ డి.సామ్రాజ్యం ఈ వివరాలను బుధవారం మీడియాకు వెల్లడించారు. ఈ నెల 26 నుంచి డిసెంబరు 26 వరకు గుంటూరు జిల్లాలోని అమరావతి ఏసీ సర్వీసులలో 20 శాతం, ఇంద్ర ఏసీ సర్వీసులలో 10 శాతం చార్జీ రాయితీ కల్పించినట్లు తెలిపారు. హైదరాబాద్, విశాఖపట్నం వెళ్లే వారికి ఆదివారం, హైదరాబాద్, విశాఖపట్నం నుంచి వచ్చే వారికి శుక్రవారం మినహాయించి మిగిలిన అన్ని రోజులలో ఈ రాయితీ వర్తిస్తుందన్నారు. అమరావతి ఏసీ బస్సులలో గుంటూరు నుంచి విజయవాడ మీదుగా హైదరాబాద్‌లోని మహాత్మాగాంధీ బస్ స్టేషన్‌కు గతంలో రూ.920 ఉన్న చార్జీ రూ.760కి, బీహెచ్‌ఈఎల్‌కు రూ.970 ఉన్న చార్జీ రూ.800కి తగ్గింది. గుంటూరు నుంచి మిర్యాలగూడ మీదుగా బీహెచ్‌ఈఎల్‌కు రూ.870 ఉన్న చార్జీ రూ.720కి, మహాత్మాగాంధీ బస్ స్టేషన్‌కు రూ.820 ఉన్న చార్జీ రూ.670కి తగ్గిపోయింది. ఇంద్ర ఏసీ బస్సులలో గుంటూరు నుంచి మిర్యాలగూడ మీదుగా బీహెచ్‌ఈఎల్‌కు రూ.700 ఉన్న చార్జీ రూ.640కి, మహాత్మా గాంధీ బస్ స్టేషన్‌కు రూ.660 ఉన్న చార్జీ రూ.600కి తగ్గింది. పొన్నూరు నుంచి మిర్యాలగూడ మీదుగా బీహెచ్‌ఈఎల్‌కు రూ.760 నుంచి రూ.690కి, మహాత్మాగాంధీ బస్ స్టేషన్‌కు రూ.720 నుంచి రూ.660కి చార్జీలను తగ్గించారు. తెనాలి నుంచి విజయవాడ మీదుగా బీహెచ్‌ఈఎల్‌కు రూ.770 ఉన్న చార్జీ రూ.710కి, మహాత్మా గాంధీ బస్ స్టేషన్‌కు రూ.730 ఉన్న చార్జీ రూ.670కి .. తెనాలి – విశాఖపట్నం ఇంద్ర సర్వీసులో రూ.960 ఉన్న చార్జీ రూ.870కి తగ్గింది.


