దాసోహమైన అతికారులు! | - | Sakshi
Sakshi News home page

దాసోహమైన అతికారులు!

Nov 26 2026 1:29 AM | Updated on Nov 26 2026 1:29 AM

గురజాల నియోజకవర్గంలో వైఎస్సార్‌ సీపీ నామినేషన్లన్నీ కారణం చెప్పకుండా తిరస్కరించిన ఆర్వోలు అధికార పార్టీ ఎమ్మెల్యే ఆదేశాలను శిరసావహిస్తున్న ఎన్నికల అధికారులు ఆర్‌డీవోకు అప్పీలునూ అడ్డుకుంటున్న టీడీపీ గూండాలు, పోలీసులు హైకోర్టు ఆదేశాలతో నామినేషన్లు వేసిన 35 మంది సర్పంచ్‌ అభ్యర్థులు వినుకొండ, నరసరావుపేటలో వైఎస్సార్‌ సీపీ శ్రేణుల అక్రమ అరెస్టులు రిగ్గింగ్‌ చేసేందుకు బయట నుంచి రౌడీ మూకలను తరలిస్తున్న వైనం

బరితెగించిన పోలింగ్‌ అధికారులు

ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాం

సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాజ్యాంగబద్ధమైన ఏ వ్యవస్థ అన్నా సరే.. వారికి లెక్కలేదు. నామినేషన్లు వేసేందుకు కూడా హైకోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొందంటే అధికార వ్యవస్థను కూటమి ప్రభుత్వం ఏ స్థాయిలో దుర్వినియోగం చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. గురజాల నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 35 మంది వైఎస్సార్‌ సీపీ సర్పంచ్‌ అభ్యర్థులు.. టీడీపీ గూండాలు తమను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలతో మంగళవారం 35 మంది సర్పంచ్‌ అభ్యర్థులతోపాటు పలు వార్డులకు చెందిన వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు గురజాల ఆర్డీవో కార్యాలయంలో పోలీసు భద్రత నడుమ నామినేషన్లు వేశారు. అడ్డుకునేందుకు టీడీపీ గూండాలు ప్రయత్నించారు. పోలీసులు వారికి నచ్చజెప్పి నామినేషన్లు వేయించారు. మంగళవారం నామినేషన్ల పరిశీలన జరిగిన అనంతరం 35 మంది నామినేషన్లను తిరస్కరిస్తున్నట్లు ఆర్వోలు ఆదేశాలు జారీ చేశారు. ఎందుకు తిరస్కరించారో కారణం కూడా చెప్పలేదు. బహుశా రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి ఇలా జరిగి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇదిలా ఉంటే బుధవారం ఆర్‌డీవోకు అప్పీలు చేసేందుకు ప్రయత్నించిన వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులపై టీడీపీ గూండాలు దాడులకు పాల్పడి, కార్లను ధ్వంసం చేశారు. మాచవరం మండలానికి చెందిన మహిళా సర్పంచ్‌ అభ్యర్థి వెలిసెల సునీతపై పోలీసుల సమక్షంలోనే దాడి చేయడం దారుణం. పంచాయతీ ఎన్నికల్లోనూ పచ్చపార్టీ నేతల దౌర్జన్యాలు తగ్గలేదు. మున్సిపల్‌, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో నామినేషన్లు వేయనీయకుండా పోలీసులను అడ్డుపెట్టుకుని టీడీపీ గూండాలు చేసిన అరాచకాలు అందరికీ తెలిసిందే. తాజాగా పల్లెపోరులో సైతం ఓటమి తప్పదని భావించి ఏకగ్రీవం చేసుకునేందుకు అన్ని అడ్డదారులూ తొక్కుతున్నారు. వారు చేసే దౌర్జన్యాలు, అరాచకాలకు హద్దే లేకుండా పోతోంది. దీనిపై ఆర్‌డీవోకు అప్పీలు వస్తుందని ముందే తెలుసుకున్న టీడీపీ గూండాలు ఆర్డీవో కార్యాలయం వద్ద కర్రలు, రాడ్లు వంటి మారణాయుధాలతో తిరుగుతూ ఆ ప్రాంతం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పోలీసుల సమక్షంలోనే మారణాయుధాలతో తిరుగుతున్నా అవేమీ వారికి కనిపించనట్లు వ్యవహరించారు. వైఎస్సార్‌ సీపీ సర్పంచ్‌ అభ్యర్థులు తాము ఆర్డీవోకు అప్పీలు చేసేందుకు రక్షణ కల్పించాలని కోరినా, అది తమ బాధ్యత కాదని, తమకు రక్షణ కల్పించాలంటే మళ్లీ హైకోర్టు అనుమతి తెచ్చుకోవాలని పోలీసు అధికారులు మాట్లాడుతున్న తీరు ఆ శాఖ పరువును బజారుకీడుస్తోంది. ఇంత దిగజారి అధికార పార్టీ నేతల చెప్పుచేతల్లో పనిచేయాల్సిన దుస్థితి పట్టిందని ఆ శాఖలోని కొందరు అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరకు ఆర్‌డీవోను కలిసేందుకు కార్యాలయానికి వెళ్లిన వైఎస్సార్‌ సీపీ లీగల్‌ సెల్‌కు చెందిన న్యాయవాదులను సైతం లోపలకు అనుమతించకుండా పోలీసులు అడ్డుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

నరసరావుపేటలో రిగ్గింగ్‌కు ప్లాన్‌

ఇదిలా ఉంటే గురువారం నరసరావుపేట మున్సిపాలిటీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వైఎస్సార్‌ సీపీ ఏజెంట్లు, నాయకులను బైండోవర్‌ల పేరుతో అక్రమంగా నిర్బంధించేందుకు పోలీసులు వేట ప్రారంభించారు. బుధవారం రాత్రి నుంచే వైఎస్సార్‌ సీపీ ముఖ్య నేతలపై బెదిరింపులకు దిగుతున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి టీడీపీ గూండాలను పట్టణంలోకి తీసుకొచ్చి, వైఎస్సార్‌ సీపీ ఏజెంట్లను బయటకు లాగేసి రిగ్గింగ్‌ చేయాలనే కుట్రకు తెరతీస్తున్నారు. సజావుగా ఎన్నికలు జరిగితే జిల్లా కేంద్రంలో ఓటమి చవిచూడాల్సి వస్తుందనే భయంతో అధికార పార్టీ నేతలు దాడులకు సైతం తెగబడేందుకు పథక రచన చేస్తున్నట్లు సమాచారం. దీన్ని అడ్డుకోవాల్సిన పోలీసులు వారికి తొత్తులుగా మారి సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వినుకొండ, నరసరావుపేట నియోజకవర్గాల్లో తొలి విడత సర్పంచ్‌ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోలీసులను అడ్డుపెట్టుకుని అధికార పార్టీ నేతలు అరాచకాలు సృష్టిస్తున్నారు. ఎక్కడికక్కడ వైఎస్సార్‌ సీపీ నేతలు, ఏజెంట్లను అక్రమంగా నిర్బంధిస్తూ, పోలింగ్‌ రోజు బయటకు వస్తే కేసులు నమోదు చేస్తామని నేరుగా సీఐలు, ఎస్‌ఐలే బెదిరింపులకు దిగుతున్నారు.

కొందరు పోలింగ్‌ అధికారులు ఎస్‌ఈసీ పరిధిలో పనిచేయకుండా అధికార పార్టీ నేతల చెప్పుచేతల్లో పనిచేస్తున్నట్లుగా, వారు చెప్పిందల్లా చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. 35 మంది నామినేషన్లు వేస్తే 35 నామినేషన్లను తిరస్కరించడం చూస్తుంటే, కోర్టుకు వెళితే తమ ఉద్యోగాల పరిస్థితి ఏమవుతుందోననే భయం లేకుండా బరితెగించి వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. కనీసం ఎందుకు తిరస్కరించారో కూడా అభ్యర్థులకు చెప్పని దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. మాజీ ఎమ్మెల్యే ఫోన్‌ చేసినా ఆర్వోలు కానీ, ఆర్‌డీవో కానీ ఫోన్లు సైతం ఎత్తని పరిస్థితి. తాము చేసిన తప్పుకు ముఖం చూపించలేక, కనీసం మాట్లాడలేని పరిస్థితుల్లో సైలెంట్‌ మోడ్‌లోకి వెళ్లిపోయారు. నామినేషన్ల కోసం హైకోర్టుకు వెళ్లారు కానీ, ఆర్‌డీవోకు అప్పీలు చేయడానికి సైతం హైకోర్టుకు వెళ్లాల్సిందే. ఇక అసలు రాష్ట్రంలో అధికార యంత్రాంగం ఎందుకు పనిచేస్తుందో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది.

గురజాల నియోజకవర్గంలో పోటీ చేస్తే ఓటమి తప్పదనే భయంతోనే అధికార పార్టీ నేతలు దౌర్జన్యాలకు దిగుతున్నారు. దీన్ని అడ్డుకోవాల్సిన పోలీసులు పచ్చచొక్కాలు వేసుకున్న కార్యకర్తల్లా మారి వారికి అండగా నిలుస్తున్నారు. వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేస్తేనే భయంతో వణికిపోతున్నారు. ఎన్నికలు సజావుగా జరిగితే ప్రజల్లో తమకున్న వ్యతిరేకత వల్ల ఓటమి చవిచూడక తప్పదనే భయం టీడీపీ ఎమ్మెల్యే వెన్నులో వణుకు పుట్టిస్తోంది. నామినేషన్లు వేయనీయడం లేదని హైకోర్టుకు వెళ్లి, పోలీసు భద్రత నడుమ 35 మంది వైఎస్సార్‌ సీపీ సర్పంచ్‌ అభ్యర్థులు నామినేషన్లు వేస్తే, అన్నీ తిరస్కరించారు. ఆర్వోలు, ఎన్నికల అధికారులు ఎందుకు తిరస్కరించారో కారణం కూడా చెప్పడం లేదు. ఇంతకంటే దారుణం మరెక్కడా ఉండదు. దీనిపై ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేశాం. అవసరమైతే అధికారులను కోర్టుకు లాగి, వారు చేసిన తప్పుకు శిక్ష పడేలా చేస్తాం.

– కాసు మహేష్‌రెడ్డి

గురజాల మాజీ ఎమ్మెల్యే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement