లక్ష్మీపురం: గుంటూరు పోస్టల్ డివిజన్ తపాలా ఉద్యోగుల సమష్టి కృషి, అంకితభావం నిరంతర ప్రయత్నాల ఫలితంగా రాష్ట్ర స్థాయిలో విశేష గుర్తింపు సాధించింది. అర్ధ సంవత్సరానికి సంబంధించిన మెయిల్స్ ఆపరేషన్స్ విభాగంలో గుంటూరు పోస్టల్ డివిజన్ రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానాన్ని కై వసం చేసుకుంది. అదే విధంగా తపాలా వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన పంచరత్న పోటీల్లో అకౌంట్ ఓపెనింగ్ విభాగంలో గుంటూరు డివిజన్ బహుమతిని సాధించింది. ఈ సందర్భంగా నవంబర్ 19, 20 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి డివిజనల్ హెడ్స్ కాన్ఫరెన్స్‌లో ఆంధ్రప్రదేశ్ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ బి.పి.శ్రీదేవి చేతుల మీదుగా గుంటూరు డివిజనల్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ నాగాదిత్య కుమార్ అవార్డులను అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విజయాలు డివిజన్‌లోని ఉద్యోగుల అందరి అంకితభావం, సమష్టి కృషి ఫలితంగానే సాధ్యమయ్యాయని పేర్కొన్నారు.


