బీఎస్–6 వాహనదారులకు కేంద్రం ఉత్తర్వులతో ఊరట
కొత్త ప్రైవేటు వాహనాలకు మూడేళ్లకోసారి కాలుష్య పరీక్ష
రవాణా వాహనాలకు రెండేళ్లకోసారి
వాహనం వయస్సును బట్టి మారనున్న ధ్రువీకరణ గడువు
పట్నంబజారు: వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. వాహనాల నుంచి వెలువడే కాలుష్యాన్ని నియంత్రించేందుకు తప్పనిసరిగా తీసుకోవాల్సిన కాలుష్య నియంత్రణ ధ్రువీకరణ పత్రం (పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్–పీయూసీ) గడువులో కీలక మార్పులు చేసింది. ముఖ్యంగా బీఎస్–6 ప్రమాణాలతో తయారైన కొత్త వాహనాలకు పీయూసీ తీసుకునే వ్యవధిని గణనీయంగా పెంచింది. ఇప్పటివరకు తరచూ కాలుష్య పరీక్షలు చేయించుకుని సర్టిఫికెట్‌ను రెన్యువల్ చేసుకోవాల్సి వస్తుండగా, ఇకపై వాహనాల వయస్సును బట్టి మూడేళ్ల వరకు గడువు కల్పించింది. అయితే ఈ వెసులుబాటు అన్ని వాహనాలకు వర్తించదు. ప్రైవేటు వాహనాలు, రవాణా వాహనాలకు వేర్వేరు గడువులను నిర్ణయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు పాత కాలుష్య ప్రమాణాలతో ఉన్న వాహనాలకు మాత్రం మూడు నెలలు, ఆరు నెలలకోసారి సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ఈ నెల 19వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది.
అసలు పీయూసీ అంటే...
పీయూసీని తెలుగులో కాలుష్య నియంత్రణ ధ్రువీకరణ పత్రం అంటారు. వాహనాల నుంచి వెలువడే పొగలో కాలుష్య కారకాలు ప్రభుత్వం నిర్దేశించిన పరిమితుల్లో ఉన్నాయా లేదా అనేది పరీక్షించి ఇచ్చే అధికారిక ధ్రువీకరణ పత్రమే ఇది. వాహనాలు ఇంధనాన్ని వినియోగించడం ద్వారా వెలువరించే కార్బన్ మోనాకై ్సడ్, హైడ్రోకార్బన్లు తదితర కాలుష్య కారకాల స్థాయిని ప్రత్యేక పరికరాలతో పరీక్షిస్తారు. నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా ఉంటేనే సర్టిఫికెట్ జారీ చేస్తారు. ఇందులో వాహన రిజిస్ట్రేషన్ నంబర్, పరీక్షించిన తేదీ, కాలుష్య స్థాయి, సర్టిఫికెట్ చెల్లుబాటు గడువు వంటి వివరాలు ఉంటాయి. వాయు కాలుష్యాన్ని తగ్గించడం, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం, పర్యావరణ పరిరక్షణ ఈ విధానం ప్రధాన ఉద్దేశాలు. అందుకే ప్రతి వాహనదారుడు చెల్లుబాటులో ఉన్న పీయూసీ సర్టిఫికెట్‌ను కలిగి ఉండాలి.
బీఎస్–6 ప్రైవేటు వాహనాలకు మూడేళ్ల గడువు
కేంద్రం తీసుకొచ్చిన కొత్త నిబంధనల్లో ప్రధానంగా ప్రైవేటు వాహనాలకు ఊరట కల్పించింది. బీఎస్–6 ప్రమాణాలతో తయారైన కార్లు, ద్విచక్ర వాహనాలు వంటి ప్రైవేటు వాహనాలు మొదటి రిజిస్ట్రేషన్ తేదీ నుంచి ఆరేళ్లలోపు ఉంటే మూడేళ్లకోసారి పీయూసీ సర్టిఫికెట్ తీసుకుంటే సరిపోతుంది. అదే వాహనం ఆరేళ్లు దాటి పదేళ్లలోపు ఉంటే ఏడాదికోసారి సర్టిఫికెట్‌ను రెన్యువల్ చేయించుకోవాలి. పదేళ్లు దాటిన బీఎస్–6 ప్రైవేటు వాహనాలకు మాత్రం ఆరు నెలలకోసారి కాలుష్య పరీక్ష తప్పనిసరి. అంటే నూతనంగా కొనుగోలు చేసిన బీఎస్–6 కార్లు, బైకులకు పదేపదే పీయూసీ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గనుంది.
రవాణా వాహనాలకు ప్రత్యేక నిబంధనలు
ప్రైవేటు వాహనాలతో పోలిస్తే రవాణా వాహనాలకు వేర్వేరు గడువులు నిర్ణయించారు. బీఎస్–6 ప్రమాణాలతో ఉన్న ఆరేళ్లలోపు రవాణా వాహనాలకు రెండేళ్లకోసారి పీయూసీ సర్టిఫికెట్ తీసుకోవాలి. ఆరేళ్లు దాటి పదేళ్లలోపు ఉన్న వాహనాలకు ఏడాదికోసారి, పదేళ్లు దాటిన వాహనాలకు ఆరు నెలలకోసారి సర్టిఫికెట్ పొందాలి. అంటే ప్రైవేటు వాహనాలకు మూడేళ్ల గడువు కల్పిస్తే, రవాణా వాహనాలకు రెండేళ్ల గడువు మాత్రమే ఇచ్చారు. ప్రజా రవాణా, సరుకు రవాణా వాహనాలపై నిరంతర పర్యవేక్షణకు గడువులను వేరు చేశారు.
పాత సర్టిఫికెట్ల పరిస్థితి ఏమిటి?
ఇప్పటికే పీయూసీ సర్టిఫికెట్లు తీసుకున్న వాహనదారులు వెంటనే మరోసారి పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదు. కొత్త నిబంధనలు అమల్లోకి రాకముందు జారీ చేసిన సర్టిఫికెట్లకు వాటి మొదటి రెన్యువల్ సమయంలోనే కొత్త గడువులు వర్తిస్తాయి. ఉదాహరణకు, ఒక బీఎస్–6 ప్రైవేటు కారు యజమాని వద్ద ప్రస్తుతం చెల్లుబాటులో ఉన్న పీయూసీ సర్టిఫికెట్ ఉంటే, ఆ సర్టిఫికెట్ గడువు ముగిసిన తర్వాత కొత్త నిబంధనల ప్రకారం రెన్యువల్ చేయించుకోవాలి.


