బాపట్ల: కుల వివక్ష ఆ వ్యవస్థకు వ్యతిరేకంగా తన రచనల ద్వారా మధుర కంఠంతో పోరాడిన మహనీయుడు కనకదాసు అని, కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా జరుపుకోవడం అభినందనీయమని బాపట్ల వ్యవసాయ కళాశాల ఇన్‌చార్జి అసోసియేట్ డీన్ డాక్టర్ జి.శివ నారాయణ అన్నారు. వ్యవసాయ కళాశాలలో జరిగిన కనకదాసు జయంతి సభ ఆదివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కనకదాసు హరిదాసు వంశంలో పుట్టినప్పటికీ అన్ని కులాల సారాంశం ఐకమత్యమే అని చాటిన గొప్ప సంఘసంస్కర్త అని కొనియాడారు. మోహన తరంగిణి, రామ ధన్య చరిత్ర, హరి భక్తి సారము, నృసింహ స్తవ అను గ్రంథాలను, వందలాది కీర్తనలను రచించి దక్షిణ భారత కర్ణాటక సంగీత ప్రాచుర్యానికి విశేష కృషి చేశారన్నారు. దేవుడు వేరు, జీవుడు వేరు అను ద్వైత సిద్ధాంతానికి కట్టుబడి ఆధ్యాత్మిక హరిదాసు ఉద్యమానికి శ్రీకారం చుట్టారన్నారు. తొలుత కనకదాసు చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో డాక్టర్ డి.వి.సాయిరాం కుమార్, డాక్టర్ మురళీధర్ నాయక్ పాల్గొన్నారు.


