వైఎస్సార్ సీపీ శ్రేణుల ఇళ్లపై దాడి సాక్షి, గుంటూరు: టీడీపీలోని దళితులను రెచ్చగొట్టి, వైఎస్సార్ సీపీలోని దళితుల ఇళ్లపై టీడీపీ అగ్రవర్ణ నాయకులు దాడులు చేయించిన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. వట్టిచెరుకూరు మండలం గారపాడు పంచాయతీ జనరల్ కేటగిరీకి రిజర్వ్ అయింది. దీంతో తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారు, వైఎస్సార్ సీపీ నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు పోటీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక దళితవాడలోని మాదిగ సామాజిక వర్గం ఓట్లు ఇరు పార్టీలకు కీలకంగా మారాయి. దీంతో వైఎస్సార్ సీపీకి అనుకూలంగా ఉన్న మాదిగ సామాజిక వర్గ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి, తమకు ఓట్లు వేయించుకునేందుకు టీడీపీ నాయకులు పూనుకున్నారు.
పక్కా స్కెచ్‌తో.. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి గ్రామానికి చెందిన చంద్రబాబు సామాజిక వర్గ నాయకులు అదే దళితవాడలోని టీడీపీకి చెందిన మాదిగ సోదరులను రెచ్చగొట్టి, వైఎస్సార్ సీపీకి చెందిన మాదిగ సోదరుల ఇళ్లపై దాడులు చేయించారు. అగ్రవర్ణ నాయకులే నేరుగా పాల్గొంటే అట్రాసిటీ కేసులు నమోదవుతాయన్న భయంతో పక్కా స్కెచ్ వేశారు. సుమారు పది మంది అగ్రవర్ణ నాయకులు సమీపంలో నిలబడి, తమకు అనుకూలమైన 25 మంది దళితులను వైఎస్సార్ సీపీ నాయకుల ఇళ్లపైకి పంపించి దాడులు చేయించారు. తద్వారా వారిని భయభ్రాంతులకు గురిచేశారు.
ఆటోలు, బైక్‌లు ధ్వంసం..
అగ్రవర్ణ నాయకుల అండతో వైఎస్సార్ సీపీ శ్రేణులపై టీడీపీ మూకలు చెలరేగిపోయాయి. సుమారు 25 మంది టీడీపీ శ్రేణులు కర్రలు, రాడ్లతో వైఎస్సార్ సీపీకి చెందిన బేతపూడి ఏసురత్నం, పల్లపాటి అబ్రహాం, పాలేపు పవన్‌ల ఇళ్లలోకి చొరబడ్డారు. లైట్లు, కిటికీలు, బాత్రూమ్ రేకులు, ప్రహరీ తలుపులు పగలగొట్టారు. అంతటితో ఆగకుండా ఇళ్ల బయట ఉన్న ఆటోలు, ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో పసిపిల్లలతో ఇళ్లలో ఉన్న మహిళలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎందుకు దాడులు చేస్తున్నారని ప్రశ్నించినా పట్టించుకోకుండా దాడులకు పాల్పడ్డారు.
సీఐ ఏకపక్ష వైఖరితోనే..
గ్రామంలో పరిస్థితి ఇలా ఉండటానికి ప్రధాన కారణం సీఐ ఏకపక్ష వైఖరేనని స్థానిక పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. దాడిపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన వారి వాదన వినకుండా.. అధికారం వాళ్లది.. ఇష్టమైతే వాళ్లకు ఓటు వేయండి.. లేదంటే ఇళ్లలో కూర్చోండి అంటూ బెదిరించారని వైఎస్సార్ సీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. దీంతో ఏ నిమిషంలో ఏమి జరుగుతుందోనని గారపాడు దళితవాడలోని వైఎస్సార్ సీపీ మాదిగ సోదరులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోజులు గడుపుతున్నారు. పోలీసుల ఏకపక్ష వైఖరితో ఆందోళన చెందుతున్న బాధితులు, జరిగిన దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సైతం భయపడుతున్నారు.
ముందుగానే పోలీసులకు ఫోన్ చేసి చెప్పినా..
గ్రామంలో పరిస్థితి ఇలా ఉందని, తమపై దాడి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని, రక్షించాలంటూ స్థానిక వైఎస్సార్ సీపీకి చెందిన దళితులు పోలీసులకు ముందుగానే సమాచారం అందించారు. సమాచారం అందించిన గంట నుంచి రెండు గంటల వ్యవధిలోనే టీడీపీ మూకలు దాడులకు పాల్పడటం అనుమానాలకు తావిస్తోంది. పోలీసులకు సమాచారం ఇచ్చినా రక్షణ లేకుండా పోయిందని బాధితులు వాపోతున్నారు. గతంలోనూ ఇలాగే దాడులకు పాల్పడ్డారని చెబుతున్నారు.
టీడీపీలోని దళితులను
రెచ్చగొట్టి దాడులు చేయించిన
అగ్రవర్ణ నాయకులు
పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు వేయకపోతే
కొట్టి మరీ వేయిస్తామని బెదిరింపులు
రక్షణ కల్పించాలని పోలీసులకు
ముందుగానే మొరపెట్టుకున్నా
ఫలితం శూన్యం
పోలీసుల దృష్టికి తీసుకువెళ్లిన రెండు
గంటల తర్వాత ఇళ్లపై దాడులు
ఆటోలు, బైక్‌లు, రేకులు ధ్వంసం
పోలీసులు ఏకపక్షంగా
వ్యవహరిస్తున్నారని స్థానికుల
మండిపాటు