గుంటూరు వెస్ట్: బాలికల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించిన అధికారుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ బాలికలు డ్రాప్ ఔట్ కాకుండా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. కారణాలు తెలుసుకొని విద్యార్ధిని ఇంటికి వెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చి, పాఠశాల లేదా కళాశాలకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. బాల్య వివాహాలకు గురైన బాలికలకు ఒక ప్రశ్నావళిని రూపొందించి, విశ్లేషణ చేయాలన్నారు. గ్రామాల్లో జరిగే వివాహాన్ని సంబంధిత గ్రామ/ వార్డు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, మహిళా సంరక్షణా కార్యదర్శి, పంచాయతీ సెక్రెటరీకి సమాచారం అందించాలన్నారు. ప్రతి పాఠశాలలో ఒక కమిటీని ఏర్పాటు చేసి బాల్య వివాహం చేసుకోవడం వలన అనర్థాలపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ పి.జి.ప్రసూన, డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ వి.విజయ లక్ష్మి, ప్రాంతీయ పర్యవేక్షక అధికారి జి.సునీత పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ


