● వ్యాధి సోకితే సొంత పేరు కూడా
మర్చిపోతారు
● పెరుగుతున్న వ్యాధి బాధితులు
● అప్రమత్తంగా ఉండాలని
వైద్యుల సూచన
● నవంబర్ అల్జీమర్స్ అవగాహన నెల
గుంటూరు మెడికల్: ఆధునిక జీవన శైలి వలన మతిమరుపు బాధితుల సంఖ్య ప్రతిఏడాది పెరుగుతోంది. వయస్సు పెరుగుతున్న కొద్ది మతిమరుపు రావటం సహజం. దీనినే అల్జీమర్స్ వ్యాధి అంటారు. ఆరోగ్య సంస్థల నివేదిక ప్రకారం ప్రతి 32 సెకన్లకు ఒకరు ఈవ్యాధి బారిన పడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా జబ్బు సోకిన వారికి సహాయకులుగా ఉండేవారికి అవగాహన కల్పించటం కోసం 1983 నుంచి ప్రతి ఏడాది నవంబర్ మాసాన్ని అల్జీమర్స్ అవగాహన నెలగా నిర్వహిస్తున్నారు.
పేరు కూడా మర్చిపోతారు....
ఇంటినుంచి బయలుదేరిన వ్యక్తి కొంత దూరం వెళ్లాక ఇంటి అడ్రస్ మర్చిపోవటం, తన పేరు కూడా రోగి మర్చిపోయే స్థితికి చేరుకోవటం ఈ జబ్బు యొక్క లక్షణం. స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్స్‌లో ఆన్‌లైన్‌లోనే వెతుకుతూ మెదడును ఏ మాత్రం వాడకుండా లేజీగా వదిలివేయటంతో వ్యాధి బారిన పడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. వ్యాధి వచ్చాక బాధపడటం కంటే రాకుండా ముందస్తుగా కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవటం చాలా ఉత్తమం. నియంత్రణే తప్పా నివారణ లేనిది ఈ వ్యాధి.
వ్యాధి లక్షణాలు...
అల్జీమర్స్ వ్యాధి సోకిన వారు తమ పేరు కూడా మర్చిపోతారు. బంధువుల, కుటుంబ సభ్యుల పేర్లు మర్చిపోవటంతోపాటుగా వారిని గుర్తించటం కూడా కష్టమే. ఈ వ్యాధి ఎక్కువగా 60 సంవత్సరాలు దాటిన వారిలో వస్తోంది. నేడు 40 ఏళ్ల వారిలో కూడా వ్యాధి లక్షణాలు కనిపించటం ఆందోళన కలిగిస్తోంది.
వ్యాధి రావటానికి కారణాలు..
వ్యాధి రావటానికి జన్యుపరమైన కారణాలు, కుటుంబంలో ఒకరికి వ్యాధి ఉంటే వారసత్వంగా వచ్చే అవకాశం ఉంది. జీవనశైలిలో మార్పులు, నిద్రలేమి, ఒత్తిడికి గురవ్వటంతోపాటుగా బీపీ, షుగర్, గుండెజబ్బులాంటి దీర్ఘకాలిక వ్యాధి బాధితులు వ్యాధి బారిన పడుతున్నారు.
జీజీహెచ్‌లో మెమరీ క్లీనిక్
అల్జీమర్స్ వ్యాధి గ్రస్తులకు జీజీహెచ్ న్యూరాలజీ ఓపీ వైద్య విభాగంలో మంగళ, గురువారం, శనివారం ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రతిరోజూ 30 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. వ్యాధిని పెరగనీయకుండా చేయటం తప్పా పూర్తిగా తగ్గించేందుకు మందు లేదు. జిల్లాలో 25 మంది న్యూరాలజిస్టులు ఉండగా ప్రతిరోజూ ఒక్కొక్కరి వద్ద ఇరువురు అల్జీమర్స్ చికిత్స కోసం సంప్రదిస్తున్నారు.


